ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు ఆగడం లేదు. తమ హీరోకు సంబంధించి ఏ చిన్న అంశం కనిపించినా దాన్ని వైరల్ చేసి పడేస్తున్నారు. మొన్నటికిమొన్న ''ప్రభాస్ హాలీవుడ్ కు వెళ్తాడంట'' అంటూ ఓ చిన్న గాసిప్ పుడితే దాన్ని తెగ వైరల్ చేశారు.
ఏకంగా సదరు హాలీవుడ్ దర్శకుడు లైన్లోకి వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త టాపిక్ అందుకున్నారు ఫ్యాన్స్. ఈసారి ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా మేటర్. సైన్స్-ఫిక్షన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోందనే విషయం అందరికీ తెలిసిందే.
స్వయంగా నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు కూడా. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త ట్రెండింగ్ అందుకున్నారు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రాబోతోందట.
భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి, ఆ సెటప్ లో రాసుకున్న కథతో ప్రభాస్ హీరోగా సినిమా తీయబోతున్నాడట నాగ్ అశ్విన్. ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కోసమే సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును సలహాదారుగా తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. ఆయనకు గతంలో ఆదిత్య369 అనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ సినిమా తీసిన అనుభవం ఉంది.
ఈ సంగతి పక్కనపెడితే.. సెకెండ్ వేవ్ కారణంగా ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం కాబోతోంది. లెక్కప్రకారం జులై నుంచి తను షూట్ మొదలుపెడతానని గతంలో ప్రకటించాడు నాగ్ అశ్విన్. కానీ ప్రభాస్ సినిమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాధేశ్యామ్ పూర్తయి, ఆదిపురుష్ ఓ కొలిక్కి వచ్చేవరకు నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వచ్చేలా లేదు.