కరోనా సెకెండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ దారుణంగా విఫలమయ్యారని ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని మోదీ అలసత్వం వల్లే దేశంలో కరోనా సెకెండ్ విజృంభించడానికి కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అనేక దఫాలు విమర్శలు గుప్పించారు.
తాజాగా మరోసారి మోదీపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన పర్చువల్ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ మోదీపై విమర్శల మోత మోగించారు. మోదీ పెద్ద ఈవెంట్ మేనేజర్ అని అభివర్ణించారు.
కరోనా కట్టడితో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో మోదీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వైరస్ వ్యాప్తికి ప్రధాని మోదీనే కారణమని మరోసారి స్పష్టం చేశారు. ఈ మొత్తం విపత్కర పరిస్థితికి మోదీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కోవిడ్- 19ను మోదీ సరిగా అర్థం చేసుకోలేకపోయారని రాహుల్ ఆగ్రహించారు. కేవలం రెండు శాతం ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి వైరస్‌కు గేట్లు బార్లా తెరిచారని రాహుల్ ఫైర్ అయ్యారు.
కరోనా సెకెండ్ వేవ్‌ను ఎదుర్కోవాలంటే దేశానికి కావాల్సింది ఈవెంట్ మేనేజ్మెంట్ కాదని, వైరస్ కట్టడికి వ్యూహాలని రాహుల్ తేల్చి చెప్పారు. ఇప్పటికైనా వ్యాక్సిన్‌పై సరైన వ్యూహం లేకపోతే రానున్న రోజుల్లో అనేక వేవ్‌లు వచ్చే ప్రమాదం పొంచి ఉందని రాహుల్ హెచ్చరించారు.