దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలనేది కేవలం నినాదాలకు, డిమాండ్లకే పరిమిత మైంది. వెండితెరతో పాటు రాజకీయాల్లోకి వచ్చి ఆయన తెలుగు సమాజంతో పాటు జాతీయ స్థాయిలో అందించిన సేవలు అమూల్యమైనవి. అలాంటి రాజకీయ, సినీ దిగ్గజానికి భారతరత్న రాకుండా అడ్డుకుంటున్న బలమైన శక్తులేంటి? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.
ఎన్టీఆర్ జయంతో, వర్ధంతో వస్తే … భారతరత్న ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ ప్రముఖులు, టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తుండడం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్‌కు అత్యున్నత పురస్కారం రాకుండా టీడీపీ ముఖ్యులే అడ్డుకుంటు న్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
అందులోనూ ఆయన కుటుంబ సభ్యులే మోకాలడ్డుతున్నారని ఢిల్లీ వర్గాల టాక్. ఒకవేళ ఎన్టీ ఆర్కు భారతరత్న ప్రకటిస్తే, ఆ దివంగత నేత సతీమణి లక్ష్మీపార్వతి అందుకుంటారని అక్కసుతో అడ్డుకుంటున్నారనే బలమైన విమర్శ లేకపోలేదు. ఒక వైపు పైకి భారతరత్న డిమాండ్ చేస్తూనే, లోలోపల మాత్రం ఇవ్వకుండా చక్రం తిప్పారనే బలమైన వాదన వినిపిస్తోంది.
మోదీ సర్కార్ మొదటి విడత పాలనలో టీడీపీ కూడా పాలు పంచుకుంది. పైన ప్రస్తావించిన ఆరోపణల్లో నిజం లేకపోతే … మరెందుకుని ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించుకోలేక పోయారో టీడీపీ నేతలే సమాధానం చెప్పాల్సి వుంది.
తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇందుకోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఎవరు కృషి చేయాలో ఆయన సెలవిస్తే బాగుండేది.
నిన్నమొన్నటి వరకు మోదీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన అశోక్‌గజపతి రాజు ఎందుకు కృషి చేయలేదో సమాధా నం చెప్పాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ సేవల్ని ప్రశంసించే వారే. మరి అత్యున్నత పురస్కారం ఎందుకు దక్కలేదన్నదే మిస్టరీగా మారింది.