కొద్ది రోజుల కిందటి వరకు మన తెలుగు జనాల వరకు కరోనా అంత సీరియస్ కాదు. కొంత వరకు దాని మీద దృష్టి పెట్టినా, వీలయినంత లైట్ తీసుకుంటూ వాట్సాప్ లో జోక్స్ షేర్ చేసుకుంటూ గడిపేసారు. ఎప్పుడయితే థియేటర్లు, మాల్స్ మూసివేసారో, కాస్త సీరియస్ నెస్ వచ్చింది. ఆ తరువాత ప్రధాని మోడీ వన్ డే స్వచ్ఛంధ కర్ప్యూ ప్రకటించారో, ప్రతి ఒక్కరి దృష్టి పూర్తిగా అటు మళ్లింది. సోషల్ మీడియాలో కరోనా మీద అవగాహన విడియోలు కావచ్చు, వాటిలో వున్న నిజమైనవి, ఫేక్ వి ఏవైనా కావచ్చు అన్నీ కలిసి కరోనా మీద భయాందోళనలు పెంచాయి.
ఇప్పుడు లేటెస్ట్ గా దేశ వ్యాప్తంగా రైళ్లు బంద్ కావడం, 75 జిల్లాలను లాక్ డౌన్ లోకి చేర్చడంతో కరోనా పూర్తిగా సీరియస్ టర్న్ తీసుకుంది. కరోనా విషయంలో చైనా, ఇటలీ, అమెరికా అనుభవాలు మన ప్రభుత్వాలకు మార్గదర్శకంగా మారాయి. మూడో స్టేజ్ నుంచి నాలుగో స్టేజ్ కు చేరకుండా చేయడం ప్రథమ కర్తవ్యం అని ప్రభుత్వాలు గ్రహించాయి. దీనికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న పాయింట్ ముమ్మాటికీ కరోనా విషయంలో వర్తిస్తుందని అర్థం అయింది. ఎందుకంటే కరోనాకు మందు లేదు కనుక, వ్యాప్తి చెందడం అత్యంత సులువు కనుక.
మూడో స్టేజ్ నుంచి నాలుగో స్డేజ్ కు వెళ్తే కరోనాను కంట్రోలు చేయడం అభివృద్ధి చెందిన అమెరికా, ఇటలీ వంటి దేశాల వల్లే కాలేదు. భారత్ లాంటి అధిక జనాభా వున్న వర్థమాన దేశానికి మరీ కష్టం. పైగా భారతదేశం అంటే 70శాతం పల్లెలే. ఇక్కడ వ్యవహారాలు, ఇక్కడి ప్రజల వ్యవహార శైలితో అంత సులువు కాదు. అందుకే ప్రభుత్వం ఈ లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ లాక్ డౌన్ కూడా కేవలం 75 జిల్లాలకే పరిమితం అవుతుందని అనుకోవడానికి లేదు. కానీ అలా పరిమితం కావాలనే కోరుకోవాలి.
మొత్తం మీద కరోనా ఇప్పుడు భారత్ లో కూడా సీరియస్ టర్న్ తీసుకుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వాల కన్నా ప్రజల చేతుల్లోనే ఎక్కవ వుంది. దీన్ని వ్యాప్తి చేయకుండా చేయడం ఒక్కటే అందరి కర్తవ్యం. అది ఏ మాత్రం నిర్ణక్ష్యం చేసినా, దేశం కొన్ని ఏళ్లు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం వుంది.