తెలుగునాట ఇప్పుడు నడుస్తున్నది తాయిలాల సీజన్. మహిళలకు రెండేసి వేలు (పదివేలలో పార్ట్ పేమెంట్), వృద్దులకు, నిరుద్యోగులకు సాయం డబుల్, ఇంకా సెల్ ఫోన్ లు వచ్చాయి. ప్రతి కులానికీ (కమ్మ, రెడ్డి తప్ప) కార్పొరేషన్. ఇలా మళ్లీ ఎన్నిక కావడానికి, ప్రభుత్వ ఖజానా ఎంత ఖాళీ చేయాలో అంతా చేస్తున్నారు చంద్రబాబు.
అయితే ఈ పందేరాల పరంపర ఇంకా ఆగదని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చేలోగానే ఉద్యోగులకు తాయిలాలు వుంటాయని వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఉద్యోగులకు డిఎ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఉంచారు. అలాగే పే రివిజన్ అరియర్స్ చాన్నాళ్ల వరకు ఇవ్వకుండా వుంచారు. అలాంటిది ఇప్పుడు వాళ్లకు వరాలు ఇవ్వబోతున్నారు అని ఉద్యోగ సంఘాల సర్కిళ్లలో వినిపిస్తోంది. అందుకే వాళ్లంతట వాళ్లు ఏ డిమాండ్ చేయకుండా వున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి రాష్ట్ర ఉద్యోగుల పే రివిజన్ కమిటీ వేసి, ఇంటీరియమ్ అనౌన్స్ చేయాల్సి వుంది. అది అలా పెండింగ్ లో వుంది. ఇప్పుడు దీనినే ఎన్నికల తాయిలంగా వాడతారని వినిపిస్తోంది. సాధారణంగా కమిటీ వేసిన తరువాత ఇంటీరియమ్ అన్నది అనౌన్స్ చేయడానికి కొంత టైమ్ తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం కమిటీ ప్రకటన, దాంతోనే ఇంటీరియమ్ పెంపు ప్రకటన ఒకేసారి వచ్చే అవకాశం వుందని టాక్ వినిపిస్తోంది.
పదిహేను నుంచి 20శాతం ఇంటీరియమ్ వుండొచ్చని ఉద్యోగులు ఆశగా లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఫైనల్ బెనిఫిట్ ఎలాగూ ముఫైశాతం వరకు వుంటుంది. ఇంటీరియమ్ 10శాతానికి పైగానే వుండడం ఎప్పుడూ కామన్. అందుకే ఈసారి చంద్రబాబు 15 నుంచి 20శాతం ఇంటీరియమ్ తో పే రివిజన్ కమిటీని ప్రకటిస్తారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
అయితే రాష్ట్ర ఖజానా పరిస్థితి చూస్తుంటే అంత భారం సాధ్యమా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇంటీరియమ్ ప్రకటించి, దాన్ని ఏప్రియల్ లేదా మే నెల జీతాలతో ముడి పెడతారని అంటే నగదుగా మే నుంచి కానీ ఏప్రియల్ నంచి కానీ అమలు అవుతుందని, ప్రస్తుతానికి ఎన్నికలు అయ్యేవరకు భారం పడదని టాక్. ఈ మధ్య ఫింఛనర్లకు కూడా డీఆర్ అడ్జస్ట్ మెంట్ ను బాబు ఇలాగే చేసారు.
మళ్లీ ప్రభుత్వం వస్తే, ఏవో ఊపుతాపులు పడతారు. లేదూ వేరే ప్రభుత్వం వస్తే ఆ బాధలు వాళ్ల పడతారు. మొత్తంమీద పన్ను కట్టేవాళ్ల డబ్బులతో ఇలా అందరూ పబ్బాలు గడుపుకుంటున్నారు.