మూడు సినిమాలకే అఖిల్ అంటే ఏంటో ఇండస్ట్రీకి తెలిసొచ్చింది. పేరుకు పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో అయినప్పటికీ అతడిపై, అతడి బ్యాక్ గ్రౌండ్ పై భరోసాతో డబ్బులు పెట్టే నిర్మాతలు ఇప్పుడు లేరు. అందుకే అఖిల్ నెక్ట్స్ సినిమాకు ప్రొడ్యూసర్ దొరకడం కష్టంగా మారింది.
భారీ బడ్జెట్ పెట్టి తీసిన మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇక చేసేదేం లేక అఖిల్ రెండో సినిమాకు తనే నిర్మాతగా మారాడు నాగార్జున. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా హలో సినిమా ప్రొడ్యూస్ చేశాడు. కానీ అది ఆడలేదు. ఇప్పుడు మూడో సినిమా మిస్టర్ మజ్నూను బయట ప్రొడ్యూసర్ తో చేశాడు. ఇది కూడా ఆడలేదు.
ఇప్పుడు చిన్న కొడుకు కోసం మరోసారి నిర్మాతగా మారడానికి నాగ్ కూడా సిద్ధంగా లేడు. ఇలా ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి తను నిర్మాతగా మారుతూ పోతుంటే మొదటికే మోసం వస్తుందని నాగార్జున గ్రహించినట్టున్నాడు. అందుకే ఇప్పుడు అఖిల్ సినిమా కోసం నిర్మాతను వెదికే పనిలో పడ్డారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆది పినిశెట్టి సోదరుడు సత్య పినిశెట్టి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. తన అప్ కమింగ్ ప్రాజెక్టును ఈ నెలలోనే ప్రకటిస్తానని మిస్టర్ మజ్ను విడుదలకు ముందు అఖిల్ తెలిపాడు. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ మరోసారి గ్యాప్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ గ్యాప్ లో నిర్మాతను వెదికిపట్టుకుంటారేమో!