జూలై 2, 3 తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారు. ఆ రెండు రోజులు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రశ్నల ప్లెక్సీలు, హోర్డింగ్‌లు ప్రధానికి స్వాగతం పలుకుతూ ప్రత్యక్షం కావడం చర్చకు దారి తీసింది.
అసలే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, జాతీయ అధికార పార్టీ బీజేపీ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీల్లో, హోర్డింగ్‌ల్లో ప్రత్యేకంగా ఎవరి పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రత్యేకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో భారీగా హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేయడంపై బీజేపీ మండిపడుతోంది. టివోలీ థియేటర్ ఎదురుగా బైబై మోదీ అనే హాష్ ట్యాగ్‌తో భారీ ఫ్లెక్సీ ప్రత్యక్షమైంది.
రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్, నాలుగేళ్ల కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్, హఠాత్తుగా లాక్‌డౌన్ అని గరీబోల్లను చంపినవ్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవని ప్రశ్నలతో నిలదీయం గమనార్హం.
గత నెలలో ప్రధాని మోదీ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో కూడా 17 ప్రశ్నలతో ప్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రీతిలో మోదీని వినూత్నంగా నిలదీయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీటిని అధికార పార్టీనే ఏర్పాటు చేసిందని, కనీసం పేరు చెప్పుకుని ప్రశ్నించే దమ్ము కూడా టీఆర్ఎస్‌కు లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
టీఆర్ఎస్‌కు ఎందుకంత భయమని బీజేపీ ఎదురు దాడికి దిగింది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటూ బీజేపీ తలపడుతుండడం కూడా ఇలాంటి ప్లెక్సీలు, హోర్డింగ్‌లు ప్రత్యక్షం కావడానికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.