నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మరోసారి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. తనపై నమోదైన సీఐడీ కేసులను కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయనకు వ్యతిరేక తీర్పు వెలువడింది. రాజద్రోహం మినహా మిగిలిన కేసులకు సంబంధించి ఆయన్ను విచారించుకోవచ్చని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. జగన్ ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు ప్రతిరోజూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో ఒకరోజు సీఐడీ హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకెళ్లి సత్కరించి పంపింది. అప్పటి నుంచి రఘురామ వాయిస్ మరింత పెంచారు. అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు కూడా తనను సీఐడీ అధికారులు చితక్కొట్టారని చెబుతున్న సంగతి తెలిసిందే. ఆయన బాధను అర్థం చేసుకున్న వాళ్లు అయ్యో పాపం అని సానుభూతి చూపారు. ఆయనంటే గిట్టని వాళ్లు మాత్రం తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డ వాళ్లున్నారు.
ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ మాట్లాడారని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇందులో రాజద్రోహం కూడా వుంది. రాజద్రోహంపై సుప్రీంకోర్టు స్టే విధించిందని, మిగిలిన కేసులను కొట్టి వేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ తరపున న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
విచారణ పేరుతో పిటిషనర్‌ను ఇబ్బందికి గురి చేయకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. అలాగే ఎంపీ ఎక్కడికైనా పర్యటించాలని అనుకున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేందుకు సీఐడీ కేసులు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తోందని వాదించారు.
మరోవైపు సీఐడీ తరపు ఏజీ వాదిస్తూ… రాజద్రోహం విషయానికి వెళ్లమన్నారు. మిగిలిన సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో విచారణ జరుపుతామన్నారు. విచారణకు పిటిషనర్ సహకరించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… రఘురామను హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సీఐడీని ఆదేశించింది.
విచారణ సమయంలో హైకోర్టు నిబంధనలను అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించడం గమనార్హం. మొత్తానికి ఏపీకి రాకుండానే సీఐడీ విచారణను రఘురామ ఎదుర్కోబోతున్నారన్న మాట!