చంద్రబాబుకు చాకిరేవు పెడుతూ కొడాలి నాని మాట్లాడిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతలోనే, గంటల వ్యవథిలో మరోసారి మీడియా ముందుకొచ్చారు నాని. నిన్నటికి నిన్న బాబుకు చాకిరేవు పెట్టిన నాని, ఈరోజు చంద్రబాబు మీడియాను ఉతికి ఆరేశారు. ఈనాడు-ఈటీవీ, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సాగిస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు.
“రామోజీరావు చెబితే రాష్ట్రం మారిపోద్దా.. అలా అయితే ఇలాంటి ఈనాడు పేపర్లు నేను 6 పెడతా, ఇలాంటి ఆంధ్రజ్యోతి పేపర్లు 10 పెడతా. అసలిప్పుడు పేపర్లు ఎవడు చదువుతున్నాడు. అవి తుడుచుకోవడానికి కూడా పనికిరావు. జనాల్ని మీడియా మార్చలేదు. ఆ రోజులు పోయాయి. నిజంగా మీడియా ప్రభావం చూపిస్తుందనుకుంటే 300 కోట్లు పెట్టి నేను 3 ఛానెళ్లు పెడతా. 24 గంటలు చంద్రబాబును తిడతా. ఇవి రాజకీయాలు కావు. చంద్రబాబు చచ్చే వరకు ఇదే ఆయన రాజకీయం. అది మన దౌర్భాగ్యం.”
ఇలా ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు కొడాలి నాని. అరబిందో కంపెనీపై చంద్రబాబు మీడియా చేసిన ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. కేవలం ఎంపీ విజయసాయి రెడ్డి వియ్యంకుడు అవ్వడం వల్లనే అరబిందో సంస్థపై టీడీపీ, దాని మీడియా బురద జల్లుతున్నారని అన్నారు. ఇలా బురద జల్లాలనుకుంటే తను 3 టీవీ ఛానెళ్లు పెట్టగలనని, యాంకర్లకు 10-12 సూట్లు కుట్టించగలనని అన్నారు.
“ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఏదో మూల చిన్న వార్త ఇస్తారు. దాన్ని చంద్రబాబు చూస్తారు. పొద్దున్నే జూమ్ మీటింగ్ పెడతారు. ఆ చిన్న వార్తను చీల్చిచెండాడి చేట అంత చేయాలని చెబుతారు. వెంటనే ఆ నలుగురు యాంకర్లు రెడీ అయిపోయారు. చివరికి వాళ్లు గెస్టుల్ని కూడా మార్చరు. వాళ్లలో వాళ్లే కేట్లు మార్చుకుంటారు. రాత్రి వరకు నోరు అరిగేలా వాగుతూనే ఉంటారు. ఏం ఈమాత్రం పని మేం చేయలేమా? వాళ్లతో మనకెందుకు వదిలేయమని, జగన్ చెప్పడంతో మేం ఊరుకుంటున్నాం. వాటిని వదిలేస్తున్నాం.”
మద్యంలో విషం అంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని కూడా నాని తిప్పికొట్టారు. మద్యం అంటేనే విషం అని, మళ్లీ ప్రత్యేకంగా టీడీపీ జనాలు చెప్పడం కామెడీగా ఉందన్నారు. అయినా పిల్లలు తాగే హెరిటేజ్ పాలలో విషం కలిపితే చంద్రబాబుకు కనిపించదని, మద్యంలో విషం మాత్రం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కూడా ఎల్లో మీడియా అత్యుత్సాహాన్ని తిప్పికొట్టారు.
ఎన్టీఆర్ ది సింహం రక్తం అయితే, చంద్రబాబుది నక్క రక్తం అన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించడం కోసం మహానాడు పెడితే.. ఆ ఆశయాన్ని, ఆ పండగను నీరుగార్చేలా మినీ మహానాడు, చిట్టి మహానాడు, బొచ్చు మహానాడు పెట్టిన ఘనత చంద్రబాబుది అన్నారు నాని.