హనుమంతుడి జన్మస్థలం విషయంలో జరుగుతున్న వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఆంజనేయుడు పుట్టిన ప్రదేశం తిరుమలేనంటూ ప్రకటించిన టీటీడీ.. దాన్ని మరింత పొడిగించకుండా ఉంటే బాగుండేది. అభ్యంతరాలుంటే చెప్పండి అంటూ ప్రకటించేసరికి దేశవ్యాప్తంగా పలువురు టీటీడీ నిర్ణయాన్ని ఖండిస్తూ లేఖలు రాశారు. అలా వచ్చిన లేఖల్లో కర్నాటకలోని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చిన లేఖ కాస్త ఘాటుగా తగిలింది.
దీంతో సదరు ట్రస్ట్ సభ్యుల్ని చర్చలకు రమ్మంటూ ఆహ్వానించింది టీటీడీ. వారి ఆహ్వానం మేరకు చర్చల్లో పాల్గొన్న తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి కొత్త రచ్చ మొదలు పెట్టారు. జీయర్ స్వాములను ఈ వివాదంలోకి తీసుకొచ్చారు. అసలు జీయర్ల ప్రమేయం లేకుండా ఈ కమిటీ ఏంటి, ఈ ప్రకటన ఏంటి అని ప్రశ్నించారు. పెద్ద జీయర్ నిర్థారిస్తే తాను తిరుమలే ఆంజనేయుడు జన్మస్థలం అని ఒప్పుకుంటానని స్పష్టం చేశారు.
టీటీడీ కమిటీ వేసింది, ఆ కమిటీ పరిశోధన చేసింది, చివరకు అంజనాద్రే, అంజనీసుతుడి జన్మస్థలం అని పేర్కొంది. దీనికి నిదర్శనాలుగా జాపాలి తీర్థాన్ని పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఆంజనేయుడి ఆలయాలను ఉదాహణగా చూపించింది. పురాణేతిహాసాల్లోని కొన్ని ఆధారాలను చూపించింది. అంతా బాగానే ఉంది కానీ ఇలాంటి వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవడం మాత్రం టీటీడీ మరచిపోయినట్టుంది..
చినజీయర్, పెదజీయర్.. లాంటివారి ప్రస్తావన కమిటీలో కానీ, వారు చేసిన ప్రకటనలో కానీ లేదు. ఇప్పుడు దీన్నే బలంగా పట్టుకున్నారు గోవిందానంద సరస్వతి.
హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కి టీటీడీకి ఉన్నంత పలుకుబడి ఉండకపోవచ్చు. కానీ టీటీడీ నియమించిన కమిటీలో పెద్ద జీయర్ వంటి వారికి ఎందుకు స్థానం లేదని సూటిగా ప్రశ్నించారు సదరు ట్రస్ట్ అధినేత. శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యులు, కంచి పీఠాధిపతి, మధ్వాచార్యులు.. వంటి వారిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, వారికి అసలు ఈ విషయం తెలుసా అని ప్రశ్నించారు.
అయితే జీయర్ల వ్యవహారంపై టీటీడీ స్పందించలేదు. కనీసం కమిటీ పరిశోధన, నివేదిక వ్యవహారాన్ని కూడా జీయర్లతో చర్చించామని చెప్పలేదు. తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవహారంపై మాత్రం టీటీడీ కమిటీ సభ్యులు, జాతీయ సంస్కృత యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ మురళీధర శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆయన కేవలం తిరుమల క్షేత్ర నామాలు, ఆంజనేయుడి జన్మ తిథిపై మాత్రమే మాట్లాడారని, ఆయన టీటీడీకి రాసిన లేఖలోని భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. ఈ విషయంలో టీటీడీ కమిటీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. మరి దీనిపై జీయర్లు జోక్యం చేసుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.