ఉన్నదున్నట్టు మాట్లాడే శృతిహాసన్ ఈసారి తారల సహాయంపై కూడా అదే టైపులో స్పందించింది. కేవలం డబ్బు ఇచ్చినంత మాత్రాన గుర్తింపు లేదా ఆత్మసంతృప్తి రాదంటోంది శృతిహాసన్. ఒక్కోసారి చిన్న మాటసాయం కూడా కొండంత భరోసాన్నిస్తుందని చెబుతోంది. అందుకే సోషల్ మీడియా ఆధారంగా సహాయం చేసేటప్పుడు ప్రతి విషయాన్ని సెపరేట్ గా చూడాలని చెబుతోంది.
“సోషల్ మీడియాలో సహాయం చేయమని ఎన్నో విజ్ఞప్తులు వస్తుంటాయి. కానీ అన్నింటినీ ఒకే కోణంలో చూడలేం. డబ్బు ఎక్కువమందికి అవసరమే. కానీ కేవలం డబ్బు ఇవ్వడంతోనే మనం పెద్ద మనసు చాటుకున్నట్టు అవ్వదు. ఒక్కోసారి మనం షేర్ చేసే చిన్న సమాచారం కూడా కొంతమందికి ఉపయోగపడొచ్చు. నేను ఎప్పుడూ ఆ కోణంలోనే ఆలోచిస్తాను.”
సోషల్ మీడియాలో వచ్చే విజ్ఞప్తుల్లో అసలైనవి, నకిలీవి కనిబెట్టడం కష్టం అంటున్న ఈ ముద్దుగుమ్మ, దాని కోసం తను ఓ చిన్న టీమ్ ను ఏర్పాటుచేసుకున్నట్టు చెబుతోంది. వాళ్ల సహాయంతో తనకు తోచిన రీతితో సాయం అందిస్తున్నానని చెప్పుకొచ్చింది.
“సోషల్ మీడియా పోస్టుల్లో నిజానిజాలు కనిబెట్టేందుకు నాకో చిన్న టీమ్ ఉంది. ఎందుకంటే నాకు నేనుగా ఈ పని చేయలేను. శ్రీరామ్ అనే వ్యక్తి నాకు సహాయం చేస్తున్నాడు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ను వాళ్లు నాకు అందిస్తారు. అది నేను పోస్ట్ చేస్తాను.”
ప్రజలంతా కరోనాతో బాధపడుతున్న వేళ, కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు విహారయాత్రల పేరిట మాల్దీవులకు వెళ్లడాన్ని ఓపెన్ గా తప్పుబట్టింది శృతిహాసన్. ఇప్పుడు చేసే సహాయాన్ని డబ్బుతో మాత్రమే కొలవకూడదంటూ మరోసారి నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.