ప్రముఖ నటి రేణు దేశాయ్‌కి కొత్త సమస్య వచ్చింది. కరోనా సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్, బెడ్ సౌకర్యానికి నోచుకోని పేదలకు సాయం అందించడానికి ముందుకు రావడమే రేణు చేసిన తప్పైంది. ఒక వైపు తాను నేరుగా డబ్బు ఇవ్వనని పదేపదే ఆమె చెబుతున్నా, కొందరు నెటిజన్లు పట్టించుకోకపోగా విమర్శిస్తున్నారు. దీంతో రేణు దేశాయ్ మనస్తాపానికి లోనవుతున్నారు.
ఎవరైనా ఆక్సిజన్, బెడ్ సౌకర్యం లేని కరోనా రోగులు, తనకు మెసెజ్ పంపితే విచారించి వాటిని సమకూర్చుతానని రేణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కరోనా కష్టకాలంలో బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన రేణుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. మరోవైపు నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్లకు సాయం అందించడంలో కొందరి విపరీత ధోరణుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్టు రేణు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా తనకు బెదిరింపులు వస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. డబ్బు సాయం చేయకపోతే చచ్చిపోతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోతున్నారు. ఇలాంటి మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని రేణు దేశాయ్ హెచ్చరించారు.
ఏ ఒక్కరికీ నేరుగా ఆర్థిక సాయం అందించడం లేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు, నిత్యావసరాలు మాత్రమే అందిస్తానని రేణు స్పష్టం చేశారు. నిజంగా ఆపదలో ఉన్న రోగులకు ఇంత కంటే ఏం కావాలి? డబ్బు అవసరాలను తీర్చడానికి ఆమె లేరనే వాస్తవాన్ని గ్రహించాలి.
సాయం చేయడానికి ముందుకొచ్చే వాళ్లపై బెదిరింపులకు పాల్పడితే, ఎవరైనా ఆదుకునేందుకు ముందుకు ఎలా వస్తారు? ఈ విషయాన్ని ఆకతాయిలు గ్రహించి మంచి కోసం పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.