టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఎలా తయారైందంటే, తనపై తాను జాలి చూపుకునే వరకూ. ఇందుకు టీడీపీ డిజిటల్ మహానాడు వేదికైంది. చంద్రబాబు నోట ఖలీల్ జిబ్రాన్ కవిత్వం రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. గత వారం చంద్రబాబు ప్రియ శిష్యుడైన పత్రికాధిపతి కూడా తన వారాంతపు పలుకులను ఇదే ఖలీల్ జిబ్రాన్ కవిత్వంతో మొదలు పెట్టారు. చివరికి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేతిలో ఖలీల్ జిబ్రాన్ కవిత్వంతోనే చావు దెబ్బ తినాల్సి వచ్చింది.
అధికారంలో ఉన్నంత కాలం కార్పొరేట్ దిగ్గజాలు తప్ప, ప్రజలెవరూ చంద్రబాబుకు గుర్తు రారనే విమర్శ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిజానికి కాలం చెల్లిందని, ఆర్ట్స్ సబ్జెక్టులు వేస్ట్ అని, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులే ముద్దు అని చిలుక పలుకులు పలికిన చంద్రబాబు, నేడు పౌరహక్కులు, ప్రజాస్వామ్యం అని పెద్దపెద్ద మాటలు మాట్లాడ్డం ఆశ్చర్యపరుస్తోంది.
ఇక చంద్రబాబు ప్రస్తావించిన ఖలీల్ జిబ్రాన్ అంతర్జాతీయంగా పేరుగాంచిన కవి. ఆయన లెబనాన్ అమెరికన్ కవి. 1933 లో ' The garden of the profit ' రాశారు. అందులో pitty the nation అన్న కవిత ఉంది. దానిని 'జాతిని చూస్తే జాలేస్తోంది' శీర్షికతో ప్రముఖ జర్నలిస్టు ఆలూరి రాఘవశర్మ అనువాదం చేయగా, సాక్షి దినపత్రిక ప్రచురించింది.
చివరికి ఈ గొప్ప కవిత్వాన్ని కూడా చంద్రబాబు చాలా సౌకర్యవంతంగా తన రాజకీయ స్వార్థానికి అన్వయించుకున్నారు. ఖలీల్ జిబ్రాన్ ఆవేదనను, ఆక్రందనను పరిగణలోకి తీసుకోకుండా, కేవలం జగన్‌ను తిట్టిపోయడానికి కవిత్వాన్ని అన్వయించడం చంద్రబాబుకే చెల్లింది.
రాఘవశర్మ అనువాదం చేసిన ఈ కవిత్వం వైరల్ కావడానికి ప్రధాన కారణం ….ప్రస్తుతం మన దేశ పాలకుల అసమర్థత, నియంతృత్వ నాయకత్వాన్ని కవితాత్మకంగా నిరసించడమే. కరోనా కట్టడిలో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలుగు సమాజం ఈ కవిత్వంతో కనెక్ట్ అయ్యింది. దురదృష్టవశాత్తు చంద్రబాబు లాంటి రాజకీయ శక్తుల కంట ఖలీల్ జిబ్రాన్ పడ్డారు.
ఖలీల్ జిబ్రాన్ కవిత్వంలోని ఏ ఫంక్తులను చంద్రబాబు ప్రస్తావించారో మొదట తెలుసుకున్నాం.
‘ఏ నాయకులైతే అబద్ధాలకోరులవుతారో ఆ జాతిని చూసి జాలిపడదాం. నిజం చెప్పే ధైర్యం చచ్చిన మేధావులు, జాతి విద్వేషంతో రగులుతూ పరుల గాలిని సైతం సహించని మూకలున్న దేశాన్ని చూసి జాలిపడదాం. రక్తపాతం, చిత్రహింసలతో ప్రపంచాన్ని ఏలాలనుకునే రౌడీలను, బందిపోట్లను ఎవరైతే హీరోలుగా కొలుస్తారో అలాంటి జాతిని చూస్తే జాలేస్తుంది. తమ హక్కులు తెంచుకుపోతున్నా, స్వేచ్ఛ కొట్టుకుపోతున్నా కిమ్మనని దేశాన్ని చూసి జాలిపడాలి’ అని ఖలీల్ జిబ్రాన్ రాసిన కవిత్వాన్ని చంద్రబాబు చదివి వినిపించారు.
ప్రజలు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు మనందరం మళ్లీ చైతన్యాన్ని రగల్చాలి. ప్రతి కార్యకర్తా మార్గదర్శకుడిగా మారాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఖలీల్ జిబ్రాన్ రాసిన కవిత్వానికి పూర్తి అనువాదం ఏంటో తెలుసుకుందాం.
ఎక్కడి ప్రజలైతే గొర్రెలవుతారో, గొర్రెల కాపరులు ఎవరివైతే పక్కదారి పట్టిస్తారో, ఆ జాతిని చూస్తే జాలేస్తోంది! ఎవరి నాయకులైతే అబద్ధాల పుట్టలవుతారో, ఆ జాతిని చూస్తే జాలేస్తోంది. ఎవరి విజ్ఞత మౌనం వహిస్తుందో, ఎవరి దురభిమానం గాలి తరంగాల వెంట పడుతుందో, గెలిచిన వారిని కీర్తించడం తప్ప, గొంతు విప్పని ఆ జాతిని చూస్తే జాలేస్తోంది!
బలంతో, చిత్రహింసలతో , ఎవరైతే ప్రపంచాన్ని ఏలాలనుకుంటారో, అలాంటి బెదిరించే రౌడీలను ఎవరైతే హీరోలుగా కీర్తిస్తారో, అలాంటి జాతిని చూస్తే జాలేస్తోంది! వారికి వేరే భాష తెలియదు, వేరే సంస్కృతి తెలియదు. వారు డబ్బును శ్వాసిస్తారు, అలాంటి జాతిని చూస్తే జాలేస్తోంది.
బాగా తిని నిద్ర కోసమే నిద్రపోతారు, అలాంటి జాతిని చూస్తే జాలేస్తుంది! అలాంటి ప్రజలను చూస్తే జాలేస్తుంది! వారి హక్కులను రద్దు చేయడానికి, ఎవరు అనుమతిచ్చారు? వారి స్వేచ్ఛ కొట్టుకుపోతోంది. నా దేశం…స్వేచ్ఛ కోరే తియ్యటి కన్నీటి నేల… అని ఖలీల్ జిబ్రాన్ పాలకుల నియంతృత్వాన్ని, ప్రజల అలసత్వాన్ని ఆవిష్కరించారు.
శ్రీశ్రీ కవిత్వాన్ని పారిశ్రామిక వేత్తలు తమకు అనుకూలంగా మలుచుకుంటే, ఆ మహాకవి ఆత్మ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. గాంధీజీకి గాడ్సే నివాళులర్పించిన చందంగా, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఖలీల్ కవిత్వాన్ని చంద్రబాబు స్మరించడాన్ని పోల్చొచ్చు. నిన్నమొన్నటి వరకూ తానూ అదే పాలకుడిననే సత్యాన్ని చంద్రబాబు ఎంత బాగా మరిచిపోయారో కదా?
ప్రజలు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు మనందరం మళ్లీ చైతన్యాన్ని రగల్చాలని, ప్రతి కార్యకర్తా మార్గదర్శకుడిగా మారాలని పిలుపునిస్తున్న చంద్రబాబు నిజంగా ఖలీల్ జిబ్రాన్ కవిత్వంతో అంతగా స్ఫూర్తి పొంది ఉంటే, దేశాన్ని సర్వనాశనం చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ సర్కార్‌పై నోరు మెదపరెందుకు? మనిషంతా మోదీ భయంతో వణికిపోతున్న చంద్రబాబులో ఇలాంటి ఖలీల్ జిబ్రాన్ కవిత్వాలు ఎన్నైతే చైతన్యం రగల్చుతాయో!
అధికారాన్ని, డబ్బును శ్వాసించే చంద్రబాబంటే జాలి వేస్తోంది! ఆశలు మనిషిలో భయాన్ని పుట్టిస్తాయి. అదే ఆశయం ఉంటే ధైర్యాన్ని నింపుతుంది. అధికారాన్ని, డబ్బును ప్రేమించడం వల్లే మోదీ అంటే చచ్చేంత భయం మన పాలకప్రతిపక్ష నాయకు లకు. ప్రజలెప్పుడూ చైతన్యవంతులే.
సొదుం రమణ