దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి ఆంగ్లేయులను తరిమికొట్టిన మహాత్మాగాంధీ భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. జాతిపితగా మనం ఆరాధన భావంతో పిలుచుకునే గాంధీజీని నాథూరాం గాడ్సే అంతమొందించాడు. గాంధీజీ గుర్తున్నంత కాలం గాడ్సే కూడా నీడలా వెంటాడుతుంటాడు. గాడ్సేను స్మరించుకునే విధానం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతానికి వస్తే నేడు దివంగత ముఖ్యమంత్రి, నట కిరీటి ఎన్టీఆర్ జయంతి. ఇటు చిత్రపరిశ్రమలో, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ జీవిత చరమాంకం విషాదంతో ముగిసింది. అంతటి మహానటుడు, రాజకీయ ఉద్ధండుడైన ఎన్టీఆర్‌కు ఇలాంటి గతేంటనే ఆవేదన, సానుభూతి ప్రత్యర్థుల నుంచి కూడా వ్యక్తమైంది.
ఎన్టీఆర్ దీనస్థితికి దారి తీసిన పరిస్థితులు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఎవరైతే ఆయన్ను వెన్నుపోటు పొడిచి చివరికి గుండె పోటుకు గురయ్యేలా చేశారో, వారే నేడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. బహుశా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి మరెక్కడా ఉండదేమో.
అప్పటి వరకు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ 1982 మార్చ్ 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎన్టీఆర్‌కు ముందు, తర్వాత అనే చెప్పుకునే స్థాయిలో, తెలుగు సమాజంలో సంచలనం సృష్టించారు.
అణగారిన వర్గాల వారిని అందలం ఎక్కించారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ హీరో అనిపించుకున్నారు. మూడు దఫాలుగా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు పరిపాలించారు. అప్పటి వరకు ఆయనే అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ సీఎంగా పాలించిన రికార్డు నెలకొల్పారు. 1989లో ఓడిపోయారు.
ఆ తర్వాత 1994లో తిరుగులేని నాయకుడిగా ఆయనకు జనం పట్టం కట్టారు. 1995లో ఆయన్ను సీఎం పీఠం నుంచి మెడపట్టి దించేశారు. అది కూడా ఆయన సొంత వాళ్లు కావడం ఎన్టీఆర్‌ను మానసికంగా కుంగదీసింది. రీల్ లైఫ్‌లో చివరికి హీరోనే గెలుస్తారని మాత్రమే తెలిసిన ఎన్టీఆర్‌కు, రియల్ లైఫ్‌లో అందుకు భిన్నమైన అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
రియల్ లైఫ్‌లో విలన్ గెలుపొందడంతో ఆయన జీర్ణించుకోలేకపోయారు. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. 33 ఏళ్ల వెండితెర జీవితం, 13 ఏళ్ల రాజకీయ జీవితం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కున్న అల్లుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. వెన్నుపోటు, గుండెపోటులకు జాతీయ స్థాయిలో చంద్రబాబు ఓ ల్యాండ్‌మార్క్ అయ్యారు.
అమావాస్య-పున్నమి, వెలుగు -చీకటి, మంచీ-చెడు, గాంధీజీ -గాడ్సే ఎలాగో ఎన్టీఆర్ -చంద్రబాబు కూడా చరిత్రలో చిరస్థాయిగా వాటి సరసన స్థానం సంపాదించుకున్నారు. కొన్ని మచ్చలను ఎప్పటికీ చెరిపివేయలేరు.
ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలదండలేసి పొర్లు దండాలు పెట్టినా, మామకు పంగనామాలు పెట్టారనే విస్తృతాభిప్రాయానికి ఎప్పటికీ చావు లేదు. మామ మరణానికి కారణమయ్యారనే అభిప్రాయం ఎప్పటికీ చెరిగిపోదు. బతికి ఉన్నప్పుడు వెన్నుపోటు పొడవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ చనిపోయినా విడిచి పెట్టక పోవడమే విషాదంలో కెల్లా విషాదం.
సొదుం రమణ