నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జీవితాన్ని ఆవిష్కరించేలా చాలామంది రచయితలు పుస్తకాలు రాశారు. ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే అలా పుస్తకాలు రాసిన రచయితలందర్నీ కప్పలు, బొద్దింకలతో పోల్చారు బాలకృష్ణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన బాలకృష్ణ.. తన తండ్రి జీవితంపై పుస్తకం రాయడం ఎవ్వరికీ చేతకాదన్నారు.
“ఆయన గురించి పుస్తకాలు రాసే వాళ్లున్నారు. ఇంకా రాస్తున్నారు. ఎవరో గణపతులు, వినాయకులు, గోడమీద బూజులు, కప్పలు, బల్లులు, బొద్దింకలు.. ఇలా చాలామంది పుస్తకాలు రాస్తున్నారు. రాయాలంటే గాంధీ సినిమా నాకు స్ఫూర్తి. పుస్తకమంటే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చదివాడనేది కాదు.”
ఇలా ఎన్టీఆర్ పై పుస్తకాలు రాసిన వాళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. తన తండ్రి జీవితంపై పుస్తకం రాయాలంటే మూలల్లోకి వెళ్లాలని, తను అలా మూలల్లోకి వెళ్తానని చెబుతున్నారు.
“రామారావు గారి జీవితం పాఠ్యాంశం కావాలి. ఆయన జీవితంలో ఎన్నో కోణాలున్నాయి. ఆయనది మూల నక్షత్రం. కాబట్టి మూలల్లోకి వెళ్లాలి. నాది కూడా మూల నక్షత్రమే. నేను కూడా మూలల్లోకి వెళ్తాను. ఆయన ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు.. ఇది కాదు కావాల్సింది. ఆయన జీవితాన్ని వడబెట్టి ఓ సారాంశం తయారుచేయాలి.”
ఎన్ని పుస్తకాలొచ్చినా, ఎన్టీఆర్ పై తను రాయబోయే పుస్తకమే బాగుంటుందని చెబుతున్నారు బాలకృష్ణ. అయితే ఈ క్రమంలో ఇప్పటికే పుస్తకాలు రాసిన రచయితల్ని ఆయన బొద్దింకలు, కప్పలు అని అవమానించడం బాధాకరం.
“నేనే ఆయన గురించి పుస్తకం రాద్దాం అనుకుంటున్నాడు. ఇంకెవడూ రాయలేడు. ఆయన అంతరాల్లోకి ఎవడూ వెళ్లలేడు. ఎవడికీ ఏం తెలియదు. పుస్తకం అమ్ముడుపోవడం కోసం కథలాగ రాస్తున్నారు. వచ్చే తరం తెలుసుకునేలా ఆయన జీవితం ఉండాలి. అలా పుస్తకం రాస్తాను.”
ఇప్పటికే ఎన్టీఆర్ జీవితంపై రెండు భాగాలుగా రెండు సినిమాలు చేశారు బాలకృష్ణ. ఆ రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ జీవితాన్ని సమగ్రంగా ఆవిష్కరించలేకపోయాయి. ఇప్పుడు పుస్తకం రాస్తానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈసారి తండ్రి పరువును ఆయన ఏ తీరం చేరుస్తాడో చూడాలి.