దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ నేతలు ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి తారకరామరావు గొప్పతనాన్ని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలను నెమరువేసుకుంటున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మనుమడు, చంద్రబాబు తనయుడైన నారా లోకేశ్ తన తాత గారిని ట్విటర్ వేదికగా స్మరించుకున్నారు. తనకు ఎన్టీఆరే స్ఫూర్తి అని టీడీపీ యువ కిశోరం చెప్పుకొచ్చారు.
‘ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదు. ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం. ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా, అసాధ్యుడిగా, చరిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారు ఎన్టీఆర్. సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి. బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి, వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేద్దాం’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే తనకు స్ఫూర్తి అని లోకేశ్ చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట కొత్త యువ నాయకుడిని చూసే అవకాశాలున్నాయి. మరి తండ్రి చంద్రబాబు స్ఫూర్తి మాటేంటనే ప్రశ్నలు ఇప్పుడొద్దు.
కరోనా విపత్కాలంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సాటి మనుషులను ఆదుకునేందుకు నారా లోకేశ్, తన తాత గారి జయంతిని పురస్కరించుకుని శ్రీకారం చుట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. మంచి పనికి ఇంతకంటే మంచి సమయం లేదు లోకేశ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా లోకేశ్ కదులుతారని ఆశిద్దాం.