అదృష్టం ఎప్పుడు, ఎవరికి ఏ రూపంలో కలిసొస్తుందో చెప్పలేం. అలాంటి అదృష్టవంతుడే కర్నూలుకు చెందిన ఈ వ్యవసాయ కూలీ. పొలంలో పని చేసుకుంటున్న ఈ వ్యక్తికి హఠాత్తుగా వజ్రం దొరికింది. అంతే రాత్రికిరాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు.
జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, పగిడిరాయి ప్రాంతాల్లో అడపాదడపా వజ్రాలు దొరుకుతుంటాయి. అయితే నాణ్యమైన వజ్రాలు మాత్రం పెద్దగా ఎవ్వరికీ దొరికిన దాఖలాల్లేవు. అన్నీ వెయ్యి నుంచి 10వేల రూపాయలు ఖరీదుచేసే ముడివజ్రాలే.
కానీ చిన్న జొన్నగిరిలో ఉంటున్న ఈ కూలీకి మాత్రం ఖరీదైన వజ్రం దొరికింది. దీన్ని రహస్యంగా వేలం పాట కూడా వేశారు. గుత్తి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కోటి 25 లక్షల రూపాయలకు ఈ వజ్రాన్ని దక్కించుకున్నాడు. మార్కెట్లో దీని విలువ 3 కోట్ల రూపాయల పైనే ఉంటుందంట. ఈ ఒక్క వజ్రంతో ఆ రైతు కూలీ రాత్రికిరాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు.
కర్నూలులోని ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు వజ్రాలు దొరుకుతుంటాయి. తాజాగా కురిసిన వర్షాలతో మరోసారి ఈ ప్రాంతం జనాలు వజ్రాల వేటలో పడ్డారు. ఇందులో భాగంగానే ఈ రైతు కూలీకి కోటి రూపాయల వజ్రం దొరికింది. అయితే ఇదంతా అనధికారికమే. ఎవ్వరూ బయటపడరు. పొరపాటున బయటపడితే ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగుతారు.