లక్క ఇల్లు వ్యాసం చదివాక చాలామంది ‘‘శ్రీకృష్ణ పాండవీయం’’ చూపిన శకుని కథ కరక్టా కాదా చెప్పమని కోరుతూ మెయిల్స్ రాశారు. మామూలుగా అయితే శకుని దుష్టచతుష్టయంలో ఒకడని తెలుసు. దుర్యోధనుడికి చెడు సలహాలు యిచ్చి చెడగొట్టాడని తెలుసు. జూదంలో, ఎత్తుగడలలో ఘనుడని తెలుసు. ఇప్పటికీ ఎవరైనా తన సలహాలతో అధికారంలో వున్నవాణ్ని చెడు మార్గంవైపు, పతనం వైపు నడిపిస్తూ వుంటే శకుని అని పిలుస్తామనీ తెలుసు. అయితే ఆ సినిమా చూశాక, కొందరిలో శకుని అసలు ఉద్దేశం ఏమిటి, కౌరవుల హితమా? వినాశనమా? అనే ప్రశ్న కలిగింది. ఆ సినిమా చూడనివాళ్ల కోసం, చూసినా గుర్తు లేనివాళ్ల కోసం క్లుప్తంగా సారాంశం చెపుతాను.
దాని ప్రకారం గాంధారికి మొదటి భర్త చనిపోతాడని జోస్యం వుంది. అందువలన ఒక దున్నపోతుకి యిచ్చి పెళ్లి చేసి, దాన్ని చంపి, యీమెను వితంతువును చేసి అప్పుడు ధృతరాష్ట్రుడికి యిచ్చి పెళ్లి చేశారు. (ఇది వ్యాసభారతంలో లేదు) ఒకసారి కౌరవులు, పాండవులు యవ్వనంలో వుండగా ఓ సారి దుర్యోధనుడు పాండవులను చూసి ‘క్షేత్రజులు (తండ్రికి కాక వేరేవాళ్లకు పుట్టినవాళ్లు)’ అని హేళన చేశాడు. పాండవులు అప్పుడు ‘మీరు గోళకులు (విధవకు పుట్టినవారు)’ అని కౌరవులను ఎద్దేవా చేశారు. అది విని దుర్యోధనుడు ఆశ్చర్యపడి, ఏమిటాని వాకబు చేస్తే సంగతి తెలిసింది. తన తల్లికి మొదట దున్నపోతుకిచ్చి పెళ్లి చేసినందుకు కోపం వచ్చి, గాంధార రాజ్యంపై దండెత్తి తాతగారిని, ఆయన నూరుగురు కొడుకుల్ని ఒక పాతాళగృహంలో పడేసి, రోజుకి ఒక మెతుకు చొప్పున యిచ్చి, మాడ్చిమాడ్చి చంపమని ఆదేశించాడు. (ఇలాటి కథ మౌర్య చంద్రగుప్తుడి విషయంలో కూడా విన్నాను)
గాంధారి తండ్రి అప్పుడు ‘ఈ రకంగా తినడం వలన ఎవరూ బతకం. అందువలన అందరి మెతుకులూ కలిపి ఒక్కణ్నే తినమందాం. కనీసం వాడైనా బతకవచ్చు, దుర్యోధనుడు కనికరిస్తే బయటపడి మనందరి తరఫున ప్రతీకారం తీర్చుకోవచ్చు.’ అని సలహా చెప్పాడు. అందరూ కలిసి అందరి కంటె చిన్నవాడైన శకునిని యీ పనికి ఎంచుకుని అన్నమంతా అతనికే పెట్టారు. కొన్నాళ్లకు దుర్యోధనుడు వచ్చి చూసేసరికి అతనొక్కడే మిగిలాడు. ‘ఒక్కడివి ఏం చేయగలవు? వచ్చి మా పంచన పడివుండు.’ అని దుర్యోధనుడు అతన్ని చేరదీశాడు. కారాగారంలోనే చనిపోయిన తండ్రి అస్తికలతో పాచికలు తయారుచేసి పెట్టుకున్న శకుని, వాటితోనే తమ పగ తీర్చుకున్నాడు. దుర్యోధనుడి వద్ద ఆప్తుడిగా నటిస్తూ, మాయాద్యూతంతో పాండవులను ఓడించి, వాళ్లలో కసి రగిల్చి, కౌరవవంశ నాశనానికి కారకుడయ్యాడు. ఈనాటి భాషలో తనకు తనే నియమించుకున్న కోవర్టు అన్నమాట. శకుని కథలో యీ కోణం అప్పటి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆ పాత్రలో జీవించడంతో ధూళిపాళకు బాగా పేరు వచ్చింది.
అయితే యీ కథ ఎంతవరకు నిజం? సామవేదం వారి ‘ఇదీ యథార్థ భారతం’లో స్పష్టంగా రాశారు. ధర్మరాజు చేసిన రాజసూయయాగానికి శకుని తండ్రి హాజరయ్యాడు. అందుచేత అతను కారాగారంలో చనిపోయాడు, అతని ఎముకలతో శకుని పాచికలు చేసిపెట్టుకున్నాడు అనేది శుద్ధాబద్ధం అని. అంతేకాదు, శకుని తన సోదరులు వృషకుడు, బృహద్బలుడుతో కలిసి ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లాడని ‘శ్రీ లలితా త్రిపురసుందరీ ధార్మిక పరిషత్, విజయవాడ’ వారు ప్రచురించిన వ్యాసభారతం (తెలుగు అనువాదం)లో స్పష్టంగా వుంది. ఇంతకీ శకుని కౌరవుల మేలు కోరాడా? కీడు కోరాడా? అతని స్వభావం ఎలాటిది? అని తెలుసుకోవడానికి ‘భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్’, గుంటూరు వారు ప్రచురించిన ‘‘మహాభారత వైజయంతి’’ సీరీస్ చూశాను. వాటిలో భారతపాత్రల స్వభావాల గురించి అనేకమంది విజ్ఞులు వ్యాసాలు రాశారు. 2 వ సంపుటంలో డా. భారతం శ్రీమన్నారాయణ, 3వ సంపుటంలో డా. అప్పజోడు వేంకటసుబ్బయ్య గార్ల వ్యాసాలు కలిపి క్రింది సమాచారం రాస్తున్నాను.
శకుని గాంధార రాజైన సుబలుడి కొడుకు. గాంధారికి అన్న. చెల్లెలి పెళ్లి సమయంలో హస్తినాపురం వచ్చి కొన్నాళ్లు వుండి, వెళ్లి, మళ్లీ వచ్చి బావగారు ధృతరాష్ట్రుడుతో చనువు పెంచుకున్నాడు. మేనల్లుళ్లంటే విపరీతమైన ప్రేమ. వాళ్లకు పోటీగా వస్తున్న పాండవులంటే కోపం. పాండవనాశనం కోరుకుని ఆ దిశగా దుర్యోధనుణ్ని ప్రేరేపించాడు. సమయానుకూలంగా అతన్ని ప్రోత్సహిస్తూ, రెచ్చగొడుతూ ఆ ద్వేషాగ్ని చల్లారకుండా చూశాడు. అతని తమ్ములు తండ్రికి సహాయంగా గాంధార రాజ్యంలో వుండిపోయారు. సినిమాల్లో శకునిని వృద్ధుడిగా, దుర్బలుడిగా చూపడంతో అతన్ని మనం సైనికుడిగా వూహించలేము. కానీ అతను యుద్ధవీరుడు. ఘోషయాత్రలో గంధర్వుడితో పోరాడినవారిలో అతనూ ఉన్నాడు. కురుక్షేత్రం సంగ్రామారంభంలో భీష్ముడు అతనికి ‘రథి’ అనే హోదా యిచ్చాడు. సంజయుడు అతన్ని అక్షౌహిణీపతి అని వర్ణించాడు. యుద్ధం ఆఖరి రోజు వరకు అతను పోరాడుతూనే వున్నాడు.
రాజసూయ యాగం తర్వాత దుర్యోధనుడికి ధర్మరాజుపై అసూయ కలిగింది. మయసభలో భంగపడిన దుర్యోధనుణ్ని చూసి, ద్రౌపది నవ్విందా లేదా అన్న విషయంపై వ్యాసభారతం ఏమంటోంది? పైన చెప్పిన శ్రీ లలితా… పుస్తకం ప్రకారం – దుర్యోధనుడు, శకుని యిద్దరూ కలిసి మయసభలో తిరిగారు. దుర్యోధనుడు నీటిలో పడగానే భీమార్జున నకుల సహదేవులు నవ్వారు. ద్రౌపది నవ్వినట్లు అక్కడ రాయలేదు. అవమానభారంతో పాండవులపై దండెత్తి, వాళ్ల రాజ్యం లాక్కుంటానని దుర్యోధనుడంటే శకుని ‘అక్షవిద్యలో నాకు ప్రావీణ్యత వుంది. ధర్మరాజుకి లేదు, అయినా ఆడే వ్యసనం వుంది. మీ నాన్నకు చెప్పి అనుమతి సంపాదిస్తే మనకు ఎదురు లేదు, ఎందుకంటే ద్యూతంలో నన్నోడించేవాడు ముల్లోకాల్లో లేడు’ అన్నాడు. అతన్ని వెంటపెట్టుకుని ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి ‘నీ కొడుకు గురించి నువ్వు యీ మాత్రం కూడా చేయలేవా?’ అంటూ దెప్పిపొడిచాడు.
కానీ విదురుడు ద్యూతం వద్దన్నాడు. దాంతో ధృతరాష్ట్రుడు వెనకాడాడు. అప్పుడు దుర్యోధనుడు మయసభలో తనకు జరిగినది చెపుతూ కాస్త మసాలా జోడించాడు. కృష్ణుడు కూడా నవ్వాడన్నాడు. ద్రౌపది తన వెంట వున్న స్త్రీలతో కలిసి నవ్వింది అన్నాడు. భీముడు ‘ధృతరాష్ట్రపుత్రా (గుడ్డివాడా అని స్ఫురించేట్లు) కాస్త చూసుకుని నడు’ అన్నాడన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడికి బాధ కలిగి జూదం ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు. ఒక పెద్ద భవంతి కట్టించి, దాన్ని చూడడానికి తమ్ములతో సహా రా, వచ్చినపుడు సుహృద్ద్యూతంలో కూడా పాల్గొను అని ధర్మరాజుకి విదురుడి ద్వారా ఆహ్వానం పంపాడు. విదురుడు ధర్మరాజుకి ఆహ్వానం అందిస్తూనే హెచ్చరించాడు. ధర్మరాజు ‘నా అంతట నేను జూదం ఆడను. ఆహ్వానం వస్తే తిరస్కరించను. ఇది నా వ్రతం.’ అంటూ వచ్చాడు.
ఇదేం వ్రతమో మన తరానికి అర్థం కాదు. భారతం చదివితే జూదమనేది ఎంత చెడ్డదో, ధర్మరాజు వంటి వాణ్ని కూడా పట్టుకుని ఎలా ఆడించిందో తెలుస్తుంది. జూదరిని యితరులు వట్టి మాటలతోనే రెచ్చగొట్టగలగడం, అతను మతి కోల్పోయి సర్వం ఒడ్డడం, ఛాన్సు యిచ్చి ఒడ్డున పడేసినా, మళ్లీ గోతిలోకి పడడం గమనించవచ్చు. సినిమాల్లో ఒక్క సీనులో చూపిస్తారు కాబట్టి అడావుడిగా జరిగిపోయిందని, ధర్మరాజుకి ఆలోచించే అవకాశమే చిక్కలేదనీ అనుకోవచ్చు. కానీ ఆ జూదం అంచెలంచెలుగా సాగింది. ధర్మరాజు ఒక్కసారి కూడా గెలవలేదు. శకుని మోసంతో పాచికలు విసిరాడు అని వ్యాసుడు రాశాడు. వరుస ఓటములు కలుగుతున్నపుడు, మధ్యలో జరిగినది సమీక్షించుకుని, తనకు తగినంత సామర్థ్యం లేదని గ్రహించుకుని, తమాయించుకుని, తప్పుకునే సందర్భం ధర్మరాజుకి వుంది. కానీ అతని వ్యసనమే వాళ్ల కష్టాలకు, అంతిమంగా దేశంలోని లక్షలాది వీరుల నాశనానికి దారి తీసింది.
జూదం ఆరంభించబోతూ ధర్మరాజు ద్యూతం వలన అనర్థం కలుగుతుంది అన్నపుడు శకుని ‘విద్వాంసుడు అపండితుడిపై వాదనకు పోవడం ద్రోహం ఎలా అవుతుంది? నువ్వు నాతో జూదమాడడం ద్రోహంగా భావించే పక్షంలో అసలు ఆడనే వద్దు.’ అన్నాడు. ధర్మరాజు డబ్బంతా కోల్పోయినప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి ‘శకుని మాయావి అని మనకు ముందే తెలుసుగదా. అతను ఎక్కణ్నుంచి వచ్చాడో అక్కడికే పంపేయ్’ అన్నాడు. ‘జూదమన్నాక ఎవరైనా గెలవవచ్చు, ఓడవచ్చు. ధర్మరాజు గెలిచివుంటే యిలా మాట్లాడేవాడివా?’ అని దుర్యోధనుడు విదురుణ్ని నిందించాడు. పాయింటే కదా! ధర్మరాజు నకుల, సహదేవులను (ఆ వరుసలోనే) ఒడ్డి ఓడిపోయినప్పుడు (స్థిర, చరాస్తులతో బాటు ఇలా అన్నదమ్ములను, భార్యను ఒడ్డడం ఆ కాలంలో పరిపాటి అయివుండాలి) ‘సవతి సోదరులు కాబట్టి ఒడ్డావు. సహోదరులైన భీమార్జునులను వదిలేశావే’ అని శకుని అన్నాడు. ‘మాలో మాకు విభేదం కల్పిస్తున్నావు.’ అని ధర్మరాజు ఆరోపిస్తే ‘తాగుబోతు గోతిలో పడతాడు, అశ్రద్ధగా వున్నవాడు స్తంభాన్ని ఢీకొంటాడు. అది వాడి తప్పు కానీ ఎదుటివాడి తప్పు కాదు.’ అని జవాబిచ్చాడు శకుని.
ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులకు వాళ్ల రాజ్యం వాళ్లకు యిచ్చేసి, వెళ్లిపొండి అన్న తర్వాత పాండవులు వెళ్లిపోయారు. అప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్ర్డుడితో మొర పెట్టుకుని సగం దూరం వెళ్లిపోయిన ధర్మరాజును మళ్లీ ఆహ్వానింప చేశాడు. మన పీరియడ్ బాగా లేదు, ఇంకెప్పుడైనా చూసుకుందాం అని అనుకోకుండా ధర్మరాజు మళ్లీ జూదానికి తయారయ్యాడు. శకుని ప్రజ్ఞ కళ్లారా చూసి కూడా అరణ్య, అజ్ఞాతవాసం తీవ్రమైన షరతుకి ఒప్పుకున్నాడు. నెగ్గితే దుర్యోధనాదులను అడవులకు పంపుదామని ధర్మరాజు ఆశపడ్డట్టే కదా! అజ్ఞాతవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజ్యం తిరిగి యిస్తామనే షరతు ఉందని వ్యాసభారతం చెపుతోంది. కానీ తర్వాత దాన్ని దుర్యోధనుడు ఉల్లంఘించాడు.
వాళ్లు అరణ్యంలో వుండగా వెళ్లి వెక్కిరించడానికి దుర్యోధనుడు కర్ణుడి సలహాపై ఘోషయాత్ర తలపెడితే ధృతరాష్ట్రుడు ఒప్పుకోలేదు. అప్పుడు శకునే ‘ఒట్టి వేట కోసమే వెళుతున్నాం, పాండవుల జోలికి వెళ్లం.’ అంటూ నచ్చచెప్పి అనుమతి సంపాదించాడు. ఘోషయాత్రలో గంధర్వుడి చేతిలో పట్టుబడి, పాండవుల చేతనే రక్షింపబడి, అవమానభారంతో తిరిగి వచ్చి ‘నాకీ బతుకెందుకు ప్రాయోపవేశం చేసుకుని ఛస్తాను.’ అని దుర్యోధనుడు అంటున్నపుడు శకుని రకరకాలుగా డీల్ చేశాడు. మొదట ‘ఒక్క బొట్టు రక్తం చిందించకుండా వాళ్ల రాజ్యమంతా గెలిచి నీ చేతిలో పెడితే హాయిగా అనుభవించక, ఛస్తానంటావేమిటి చవటలా’ అని తిట్టాడు. ఆ తర్వాత ‘పోనీ అంత ముచ్చటగా వుంటే పాండవులను పిలిచి రాజ్యం అప్పగించేసేయ్, మర్యాదైనా దక్కుతుంది’ అని ఎత్తిపొడిచాడు. చివరకు అతన్ని నిరాశలోంచి బయటకు తీసుకుని వచ్చి, మరిన్ని యెత్తులు వేసేట్లా చేశాడు.
రాయబార సమయంలో దుర్యోధనుడు ఏ మాత్రం తగ్గకుండా వుండడానికి సంధి ప్రయత్నాలు చెడగొట్టాడు. కృష్ణుడికీ కావలసినది అదే. పైకి శాంతివచనాలు చెపుతూనే అటూయిటూ రెచ్చగొట్టి యుద్ధం జరిగేట్లు చూశాడు. అందుకే ‘‘మాయాబజారు’’ సినిమాలో కృష్ణుడికి నచ్చిన వ్యక్తి శకుని అని చూపించారు. శకుని గురించి అతని చెల్లెలు గాంధారి అభిప్రాయమేమిటి? ‘నా కుమారుల వినాశానానికే శకుని అక్షవిద్య నేర్చుకున్నట్లుంది. కురుపాండవ వైరానికి అతనే కర్త. అతనితో స్నేహం చేయవద్దని మా అబ్బాయికి ఎంతో చెప్పాను. ఆ ఉద్రేకస్వభావుడు వినలేదు. విధిని తప్పించడం ఎవరి తరం?’ అని శ్రీకృష్ణుడితో చెప్పుకుని శోకించింది. ధృతరాష్ట్రుడికి కూడా శకుని అంటే యిష్టం లేదు. అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడని వ్యాసుడి ద్వారా విని అతడు సంజయుడితో ‘నా కొడుకు కర్ణుడు, శకుని దుర్మంత్రులను చేరదీశాడు. వాళ్లు మా వాడి దోషాన్ని వృద్ధి పొందిస్తున్నారు’ అని వాపోతాడు.
యుద్ధం వచ్చింది. శకుని మొదటి రోజు ప్రతిపాండ్యుడనే పాండవ సేనాపతితో పోరాడాడు. రెండో రోజు ద్రోణుడికి బాసటగా వచ్చి తన రథంతో ఆయన్ని దూరంగా తీసికెళ్లాడు. తర్వాత కృపాచార్యుణ్ని అలాగే కాపాడాడు. భీష్ముడు శిఖండి పాలబడకుండా చూసే బాధ్యతను దుర్యోధనుడు కొందరు వీరులకు అప్పగించాడు. వారిలో శకుని ఒకడు. భీష్ముడు పన్నిన సర్వతోభద్రవ్యూహంలో అగ్రభాగంలో నిలిచాడు. అర్జునుడు భగదత్తుడితో యుద్ధం చేస్తున్న సమయంలో శకుని అనేక మాయలు కల్పించాడు. వాటన్నిటినీ అర్జునుడు వమ్ము చేశాడు. ఇలా పోరాడుతూనే వున్నాడు కానీ ఘనవిజయాలు అతని ఖాతాలో పడలేదు. శల్యుడు చనిపోయిన తర్వాత కూడా శకుని పోరాడుతూనే వున్నాడు. శకుని పని పట్టినవాడు సహదేవుడు. అతని కళ్ల ముందే అతని కొడుకు ఉలూకుణ్ని చంపాడు. శకుని ధనస్సు విరిచాడు. అతను భయంతో పారిపోతూ వుంటే పట్టుకుని అతని దుర్బుద్ధిని ఎత్తి చూపి, దుర్యోధనుడి ఎదురుగానే అతని భుజాలు నఱికి, ఖడ్గంతో అతని శిరస్సు ఖండించాడు. బాణంతో ఆ శిరస్సును గాలిలో ఎగరవేశాడు. శకుని కథ ముగిసింది. ఏతావతా చెప్పేదేమిటంటే శకుని కౌరవపక్షపాతే. పాండవద్వేషియే.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)