వంగవీటి మోహన రంగా. ఇది వైబ్రేషన్ కలిగించే పేరు. కాపులకు ఆయన ఆరాధ్య దైవం. దానికి మించి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి విజయవాడలో పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన మరణించి ఇప్పటికి ముప్పయి నాలుగేళ్ళు అయినా కూడా ఇంకా స్మరిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణలలో వంగవీటి ప్రస్థావన ఎపుడూ వస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే వంగవీటి మోహన రంగా 75వ జయంతి వేడుకలను జూలై 4న విశాఖలో ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రంగా బడుగుల దేవుడు అని ఆయన అంటున్నారు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లలో ఆ రోజున సమాంతరంగా ఆయన జయంతి వేడుకలు జరుగుతాయని చెప్పారు.
ఈ మధ్యకాలంలో గంటా రంగా పేరుని ఎక్కువగా తలుస్తున్నారు. పాయకరావుపేటలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వేళ ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం కాపుల నుంచే వస్తారు అని సంచలన ప్రకటన గంటా చేశారు. ఆ తరువాత వరసబెట్టి కాపు నేతలతో మీటింగ్స్ నిర్వహించారు.
ఇక లేటెస్ట్ గా కాబోయే సీఎం చంద్రబాబు, తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని కూడా గంటా అంటున్నారు. ఆయన టీడీపీలోనే ఉండడానికి నిశ్చయించుకున్నారని అర్ధమవుతోంది. మళ్లీ ఇపుడు ఆయన రంగా వేడుకల పేరిట కాపులను ఏకం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
రంగా పేరిట గంటా మరోమారు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు రంగం సిద్ధం చేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.