పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకున్న పుజారా!

గ‌త కొన్నాళ్లుగా పేల‌వ‌మైన ఫామ్ తో జాతీయ జ‌ట్టులో స్థానం కూడా కోల్పోయాడు టీమిండియా టెస్టు బ్యాటర్ ఛ‌తేశ్వ‌ర్ పుజారా. గ‌త రెండేళ్లుగా పుజారా ఫామ్ అంతంత మాత్రంగా సాగింది. పుజారా చెప్పుకోద‌గిన స్థాయిలో…

గ‌త కొన్నాళ్లుగా పేల‌వ‌మైన ఫామ్ తో జాతీయ జ‌ట్టులో స్థానం కూడా కోల్పోయాడు టీమిండియా టెస్టు బ్యాటర్ ఛ‌తేశ్వ‌ర్ పుజారా. గ‌త రెండేళ్లుగా పుజారా ఫామ్ అంతంత మాత్రంగా సాగింది. పుజారా చెప్పుకోద‌గిన స్థాయిలో ఆడిన ఇన్నింగ్స్ లు గ‌త కొంత‌కాలంగా లేవు. టీమిండియా సీరిస్ ను నెగ్గిన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో కూడా పుజారా ప్ర‌ద‌ర్శ‌న అంతంత మాత్ర‌మే. చాలా సాధార‌ణ బంతుల‌కే వికెట్ ను స‌మ‌ర్పించుకుంటూ పుజారా విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యాడు.

ఇక సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ల‌తో ఆ దేశాల్లో జ‌రిగిన టెస్టు సీరిస్ ల‌లో పుజారా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇవ్వ‌డంతో స్వ‌దేశంలో శ్రీలంక‌లో జ‌రిగిన టెస్టు సీరిస్ కు పుజారాను ప‌క్క‌న పెట్టారు సెలెక్ట‌ర్లు. ఎన్నాళ్లు పుజారాకు అవ‌కాశం ఇస్తారు, కొత్త కుర్రాళ్ల‌కు అవ‌కాశాలు ఇచ్చి చూడాల‌న్న వాద‌న మేర‌కు పుజారాను ప‌క్క‌న పెట్టేశారు సెలెక్ట‌ర్లు.

వ‌న్డేలు, టీ20ల విష‌యంలో పుజారా పేరు వినిపించ‌దు. కేవ‌లం టెస్టుల‌కే అత‌డి కెరీర్ ప‌రిమితం అయ్యింది మొద‌టి నుంచి.టెస్టుల విష‌యంలో పుజారా డిపెండ‌బుల్ అనిపించుకుంటూ ఎదిగాడు. అయితే పేల‌వ‌మైన ఫామ్ అత‌డిని జ‌ట్టుకు దూరం చేసింది.

అయితే ఒక‌వైపు ఇండియ‌న్ క్రికెట‌ర్లంతా ఐపీఎల్ లో బిజీగా ఉండ‌గా.. ఇదే స‌మ‌యంలో పుజారా కౌంటీ క్రికెట్ లో త‌న ఫామ్ ను రాబ‌ట్టుకున్నాడు. పుజారాకు ఐపీఎల్ లో స్వ‌ల్ప ధ‌ర‌కు రెండేళ్ల కింద‌ట ఒక కాంట్రాక్ట్ ద‌క్కిన‌ట్టుగా ఉంది. అయితే దీన్ని ప‌క్క‌న పెట్టేసి అత‌డు కౌంటీ క్రికెట్ మీద దృష్టి పెట్టాడు. ఇటీవ‌ల స‌క్సెస్ జ‌ట్టుకు ఆడుతూ ఎనిమిది ఇన్నింగ్స్ ల‌లో 720 ప‌రుగులు సాధించాడు. వీటిల్లో డ‌బుల్ సెంచ‌రీలు, సెంచ‌రీలు కూడా ఉన్నాయి. 

దీంతో తిరిగి టెస్టు జ‌ట్టులోకి ఈ ఆట‌గాడికి త‌లుపులు తెరుచుకున్నాయి. ఇంగ్లండ్ తో టీమిండియా ఒక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కోసం పుజారాను కూడా ఎంపిక చేశారు సెలెక్ట‌ర్లు. పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకోవ‌డం అన్న‌ట్టుగా,  పుజారా మ‌ళ్లీ టెస్టు జ‌ట్టులోకి రీ ఎంట్రీ పొందాడు.