ఈ పన్ను తగ్గింపులన్నీ పొలిటికల్ డ్రామాలే!

పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సయిజ్ సుంకం తగ్గించడం బాగానే ఉంది. కానీ. రాష్ట్రాలన్నీ కూడా తగ్గించాలని హితవు చెప్పడానికి వారికి ఏం హక్కు ఉంది. ఈ స్టంట్ ను గమనిస్తే.. కేవలం పొలిటికల్ డ్రామాగా…

పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సయిజ్ సుంకం తగ్గించడం బాగానే ఉంది. కానీ. రాష్ట్రాలన్నీ కూడా తగ్గించాలని హితవు చెప్పడానికి వారికి ఏం హక్కు ఉంది. ఈ స్టంట్ ను గమనిస్తే.. కేవలం పొలిటికల్ డ్రామాగా అది మనకు కనిపిస్తుంది. 

దేశం మొత్తం ధరల విష వలయంలో అతలాకుతలం అయిపోవడానికి కారణమవుతున్న తమ ప్రభుత్వానికి ప్రజల్లో పరువు పోతుందని భయపడుతున్నారు గనుక.. ఇలాంటి సుంకం తగ్గింపు రూపేణా కేంద్రం ఆడుతున్న డ్రామా ఇది అని అనిపిస్తోంది. 

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేవలం పెట్రోధరల కోణంలో మాత్రమే చూడకూడదు. ప్రతి లీటరు పెట్రోలు మీద కేంద్రానికి దక్కుతున్న పన్నులెంత? రాష్ట్రానికి దక్కుతున్న పన్నులెంత? అని లెక్కలు తీయకూడదు. 

స్థూలంగా అన్ని రకాల పన్నులను కలిపి గణించినప్పుడు.. కేంద్రానికి వారి అవసరానికి తగినంత, మించిన రాబడి ఉండవచ్చు… అందువల్ల వాళ్లు పెట్రోలు పన్నులు కొంత తగ్గించి.. రాజకీయ మైలేజీ కోరుకోవచ్చు. రాష్ట్రానికి దక్కుతున్న మొత్తం అన్ని రకాల పన్నుల వాటా.. పరిమితంగా ఉంటే గనుక.. రూపాయి తగ్గించడం అయినా.. వారికి చాలా పెద్ద భారమే అవుతుంది. 

ఇలాంటి రకరకాల కారణాలు అనేకం ఉంటాయి. అలాంటప్పుడు.. కేంద్రం మేం తగ్గించాం గనుక.. మీరు కూడా తగ్గించండి అని ఎలా చెప్పగలుగుతుంది.

కేంద్రానికి చేతనైతే పెట్రోలు మీద సుంకాలను కాదు, అసలు పెరిగిన పెట్రోలు ధరనే తగ్గించాలి. అప్పుడు ఆటోమేటిగ్గా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలు కూడా  ఆటోమేటిగ్గా తగ్గుతాయి. అలాంటి ప్రయత్నం వల్ల నిజంగా ప్రజలకు లాభం జరుగుతుంది. 

అలా పెట్రో ధరలను తగ్గించకుండా తమ వాటా సుంకాలను మాత్రం తగ్గించడం అంటే.. రాష్ట్రాలను ఇరుకున పెట్టడానికి ఆడే డ్రామా తప్ప ఇంకొకటి కాదు. బిజెపి పాలిత రాష్ట్రాలు డూడూ బసవన్నలా వారి సూచనల్ని పాటిస్తాయి. మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలను నిందించడం బీజేపీ లక్ష్యం. తద్వారా.. తమ హవా లేని రాష్ట్రాల్లో కూడా ప్రజాదరణ పెంచుకోడానికి ఇదొక కుట్ర!

బీజేపీ ఇంత ఓవరాక్షన్ చేయడం ఎందుకు? చాలామంది మేధావులు నిపుణులు డిమాండ్ చేస్తున్నట్లుగా పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేస్తే సరిపోతుంది కదా?! జీఎస్టీ పన్నుల ఏ పరిధిలోకి తీసుకువచ్చినా.. లీటరు పెట్రోలు ఇప్పుడున్న దానికంటె చాలా చవగ్గానే దొరుకుతుంది. 

అయితే ప్రభుత్వాల దోపిడీకి కోత పడుతుంది. అందుకే కేంద్రం ఈ డ్రామా ఆడుతోంది. పెట్రోలును కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేదాకా.. కేంద్రం ఎన్ని రకాల డ్రామాలు ఆడినా నమ్మడానికి అవకాశం లేదు.