మెగాస్టార్ అభిమానుల బాధ పగవారికి కూడా వద్దు. 2009లో మెగాస్టార్ చిరంజీవిని సీఎంగా చూడలేకపోయామని, కనీసం ఆయన సోదరుడు పవన్‌కల్యాణ్‌ను అయినా ఆ పదవిలో చూడాలని అభిమానులు కలలు కంటున్నారు. ఇందుకోసం సమావేశాలు నిర్వహిస్తూ పవన్, చిరంజీవి అభిమానుల్ని ఒకే తాటిపైకి తేవాలనే వారి ప్రయత్నాల్ని తప్పక అభినందించాలి. అయితే లాభం ఏంటి? అసలైన వ్యక్తికే తాను సీఎం కావాలని, అభిమానుల ఆకాంక్షల్ని నెరవేర్చాల్నే పట్టుదల లేదు. ఉండాల్సిన వ్యక్తికే ఆశయం లేనప్పుడు, కేవలం అభిమానులకి మాత్రం ఉంటే ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ పిల్లలు చదవకపోతే బాధ పడడం తప్ప తల్లిదండ్రులు ఏం చేయగలరు? పవన్‌కల్యాణ్ విషయంలో ఈ అభిప్రాయం వర్తిస్తుంది. సీఎం కావాలనే తపన, పట్టుదల పవన్‌లో ఏ మాత్రం కనిపించవు. కేవలం కోరిక ఉన్నంత మాత్రాన సరిపోదు. కలలను నెరవేర్చుకోవాలంటే నిద్రలేని రాత్రులు గడపాల్సి వుంటుంది. విజేతల స్ఫూర్తిగాథలు ఇదే చెబుతాయి.
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం ఎన్నికల బరిలో నిలిచింది. 18 శాతం ఓట్లను, అంతే సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. అప్పుడు వైఎస్సార్ రెండోసారి సీఎం అయ్యారు. తమ అభిమాన అగ్రహీరో, పొలిటికల్‌గా హీరో కాలేకపోయారనే ఆవేదన మెగా అభిమానుల్ని ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్ జనసేనానిగా రాజకీయ రంగంలో రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
2019లో కనీసం ఒక్క చోట కూడా పవన్‌కల్యాణ్ గెలవలేదనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. 2024లో పవన్‌ను సీఎంగా చూడా లని మెగా అభిమానులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో వారంతా సమావేశమై ఓ తీర్మానం చేశారు.
‘ఇతర పార్టీలతో జనసేన పొత్తులతో సంబంధం లేదు. మనమంతా జనసైనికులుగా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో గట్టిగా శ్రమిద్దాం. ఎలాగైనా 2024లో పవన్ కల్యాణ్‌ను సీఎంని చేయడమే మనందరి ఏకైక లక్ష్యం’ అని చిరంజీవి అభిమానులు తీర్మానించారు. త్వరలో విశాఖపట్నం, తిరుపతిలోనూ ఇదే రీతిలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. రాబోయే ఎన్నికల్లో పవన్‌ను సీఎం చేస్తామని అభిమానులు ప్రతిజ్ఞ చేయడం గమనార్హం.
మెగా అభిమానుల్ని తప్పక అభినందించాల్సిన విషయం ఒకటుంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే 51 శాతం ఓటింగ్ సంపాదించాలని గుర్తించడంతో పాటు జనసేన బలం కేవలం ఏడు శాతమే అనే వాస్తవాన్ని గ్రహించడం. అయితే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రాక్టికల్‌గా వాస్తవాలేంటో గ్రహించినప్పుడే, లోపాలను సరిదిద్దుకుని ముందడుగు వేయొచ్చు. ఇంత వరకూ జనసేనలో ఇలాంటి పని జరిగినట్టు లేదు. ఆ పని మెగా అభిమానులు చేయగలిగారు.
పవన్‌ను సీఎంగా చూసుకోవాలనే మెగా అభిమానుల ఆకాంక్షను తప్పు పట్టాల్సిన పనిలేదు. అలాంటి బలమైన కోరిక వారిలోనే లేకపోతే, ఇక మిగిలిన ప్రజానీకంలో ఎలా వస్తుంది? అయితే సమస్యల్లా ఏంటంటే మెగా అభిమానులంతా పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటుంటే, ఆయన మాత్రం చంద్రబాబును ఆ పీఠంపై చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి బీజేపీని పవన్ అడుగుతున్న రోడ్‌మ్యాప్ జగన్‌ను గద్దె దించడానికి కాదు.
చంద్రబాబును సీఎం చేయడానికే రోడ్‌మ్యాప్ అడుగుతున్నారు. ఈ విషయం తెలిసే బీజేపీ మౌనం పాటిస్తూ, జనసేనాని సహనానికి పరీక్ష పెట్టింది. ఎందుకంటే పవన్‌కు సహనం లేదని బాగా తెలుసు. ఈ రోజు కాకుంటే రేపు తన మనసులో మాటను పవన్ బయట పెడతారని బీజేపీ నమ్ముతోంది. ఏదైనా పవన్‌తోనే చెప్పించాలనేది బీజేపీ ప్లాన్. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని తానేదో పెద్ద మేథావిగా మాట్లాడానని పవన్ భ్రమల్లో ఉన్నారు. ఆ మాటలకు రానున్న రోజుల్లో ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కాలమే జవాబు చెబుతుంది.
అధికారికంగా చంద్రబాబుతో ఎలాంటి సంబంధాలు లేని పరిస్థితిలో, ఆయన్ను సీఎం చేసేందుకు రోడ్‌మ్యాప్ అడిగితే నెగెటివ్ సంకేతాలు వెళ్తాయనే భావనతో పవన్ సర్కర్ ఫీట్లు వేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అభిమానులు, జనసైనికుల మనసుల్లో ఏముందో గ్రహించి, అందుకు తగ్గట్టు పవన్ నడుచుకుంటే ఆయనకే గౌరవం. లేదంటే జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా అడ్డుపడే సంగేతేమోగానీ, వెంట ఉన్న వాళ్లు కూడా విడిచి వెళ్లిపోవడం ఖాయం.
సొదుం రమణ