మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తండ్రీతనయులు చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇద్దరినీ రాజకీయంగా చితక్కొట్టారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో యాత్ర చేస్తున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారంలో వున్నప్పుడు లుచ్చాపనులు చేసి, అధికారం ఇస్తే ఇప్పుడు ప్రాజెక్టులు కడతానని మాయ మాటలు చెబుతున్నాడని విమర్శించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ పార్టీ నేతల బూట్లు నాకిన వెధవ చంద్రబాబు అని ఘాటు విమర్శ చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన దౌర్భాగ్యుడు అని మండిపడ్డారు. 1978 నుంచి 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నారని, మరెందుకు ఈ కాలంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదని కొడాలి నాని ప్రశ్నించారు.
పులిచింతల, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలుగొండ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని చంద్రబాబును నిలదీశారు. పోలవరానికి జాతీయ హోదా తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌ది అని ఆయన గుర్తు చేశారు. పోలవరం కాలువలు తవ్వుతుంటే దేవినేని ఉమాలాంటి బ్రోకర్లతో కోర్టుల్లో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయని 420 చంద్రబాబు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అని ఆయన వెటకరించారు. లెగిస్తే మనిషిని కాదని చెప్పే చంద్రబాబు పీకేదేమీ లేదని విమర్శించారు.
చంద్రబాబు వేసే మెతుకుల కోసం ఆశపడే కుక్కలు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అని కొడాలి నాని తన మార్క్ విమర్శలతో చెలరేగిపోయారు. పనిలో పనిగా చంద్రబాబు కొడుకు లోకేశ్‌ను కూడా నాని విడిచిపెట్టలేదు. పాదయాత్రలో పది కిలోమీటర్లు నడిచి జారుడు బల్లలా పప్పు లోకేశ్ జారిపోతున్నాడని ఆయన సెటైర్ విసిరారు. పిచ్చివాగుడు వాగితే చూస్తూ ఊరుకేనది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాగే 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని కొడాలి నాని అన్నారు.