స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వైసీపీ మంత్రి ఏమన్నారంటే…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే బలిపీఠం మీద ఉంది. దానిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఇప్పటికి అయిదు వందల రోజులు పై దాటాయి. ఈ నేపధ్యంలో తాజాగా విశాఖ ఉక్కు…

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే బలిపీఠం మీద ఉంది. దానిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఇప్పటికి అయిదు వందల రోజులు పై దాటాయి. ఈ నేపధ్యంలో తాజాగా విశాఖ ఉక్కు కార్మికులు విశాఖలో భారీ ఉద్యమాన్ని కూడా నిర్వహించారు.

ఇదిలా ఉండగా విశాఖకే కాదు ఏపీకే తలమానికం లాంటి స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ అభిప్రాయాన్ని పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాధ్ కుండబద్ధలు కొట్టారు. మొదటి నుంచి మా పార్టీ వైఖరి ఒక్కటే. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అని వైసీపీ గట్టిగానే కోరుతోంది, ఈ విషయంలో రెండవ మాటే లేదు అని గుడివాడ స్పష్టం చేశారు.

ఈ విషయంలో పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు పోరాడుతున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని కూడా డిమాండ్ చేసారని ఆయన గుర్తు చేశారు. మరో వైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలలో ఉందని ఆయన పేర్కొన్నారు.

అటువంటి ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపధ్యంలో ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి వైసీపీ పూర్తి మద్దతుగా నిలిచిందని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితులలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడవాలన్నది వైసీపీ కచ్చితమైన అభిప్రాయం అని కూడా గుడివాడ చెప్పుకొచ్చారు.

ఒక విధంగా చూస్తే కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకించినట్లే. ఈ విషయంలో మొదటి నుంచి వైసీపీ ఒకే మాట మీద ఉంది. ఈ విషయంలో తాము ప్రజల పక్షం అని మరో మారు వైసీపీ క్లారిటీగా చెప్పేసింది. మరి బీజేపీ ఇపుడు దీని మీద పునరాలోచన చేస్తుందేమో చూడాలి.