సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి బాటలో ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే పయనిస్తున్నారు. ఒంగోలులో తనపై కుట్ర జరుగుతోందని, ఇందులో సొంత పార్టీకి చెందిన ఓ పెద్దనేత హస్తం వుందని బాలినేని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలినేనికి సంఘీభావం తెలుపుతూ, తాను కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బాలినేని మనోస్థైర్యం దెబ్బ తినకూడదని ఆకాంక్షించారు. తామంతా ఆయనకు అండగా ఉంటామన్నారు. వైఎస్సార్‌సీపీ అంటే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, బాలినేటి అంటే వైఎస్సార్‌సీపీ అని చెప్పుకొచ్చారు. దివంగత వైఎస్సార్‌కు బాలినేని వీరవిధేయుడన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌కు అండగా నిలిచిన అతికొద్ది మందిలో బాలినేని ఒకరన్నారు. సొంతపార్టీ వాళ్లే కుట్రలు చేస్తున్నారనే బాలినేని ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు.
మూడు జిల్లాల్లో వైసీపీకి బాలినేని ఇన్‌చార్జ్ అన్నారు. బాలినేని ఆత్మ విశ్వాసం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీపై వుందన్నారు. బాలినేనిపై కుట్రల్ని ఖండిస్తున్నట్టు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బాలినేని మాత్రమే కాదు, అదే సమస్యతో తాను కూడా ఇబ్బంది పడుతున్నట్టు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాంబు పేల్చారు.
బాలినేని మాదిరిగానే తాను కూడా సొంత పార్టీ వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్సార్ పార్టీలో కొంత మంది ముఖ్య నేతలకి తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉండాలి, మళ్లీ ఏ విధంగా గెలవాలనే ఆలోచనల్ని పక్కన పెట్టి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు.
ఇతర నియోజకవర్గాల్లో ఏ విధంగా వేలు పెట్టాలి, అలాగే ఎమ్మెల్యేల్ని బలహీన పరచాలని ముఖ్యమైన వైసీపీ నేతలు చేయడం బాధాకరం, విచారకరమన్నారు. తన విషయానకి వస్తే… నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్రను విజయవంతం చేసేందుకు కష్టపడిన వారిలో తానొకడినని గుర్తు చేశారు.
నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో తెలియని ఆ ముఖ్య నేతలు తమ నియోజకవర్గాన్ని వదిలేసి నెల్లూరు రూరల్‌లో జోక్యం చేసుకుంటున్నారని పరోక్షంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బలహీనపరచాలని చూస్తుంటే బాధేస్తోందన్నారు. తనను బలహీనపరచడం వాళ్ల చేతకాదన్నారు. వాళ్లు పొరపాటు చేస్తున్నారన్నారు. అలాంటి వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. కానీ ఇలాంటి చర్యలు పార్టీకి శ్రేయస్కరం కాదన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలను బలహీనపరచాలనే ఆలోచనలకు స్వస్తి పలకాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హితవు పలికారు. పద్ధతి మార్చుకోవాలని ఆనం రాంనారాయణరెడ్డిని ఆయన కోరారు. ఈ విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానన్నారు.