నేను కమ్మ.. నాకు బాబు చేసిన మేలు సున్నా

అతడు నాకు బెస్ట్ ఫ్రెండ్. కడప జిల్లా రాజంపేటలో ఉంటాడు. ఇప్పుడది అన్నమయ్య జిల్లా పరిథిలోకి వెళ్లింది. ఈ సంగతి పక్కనపెడదాం. నాతో పాటు మరికొంతమంది స్నేహితుల్ని కలిసేందుకు అతడు హైదరాబాద్ వచ్చాడు. దాదాపు…

అతడు నాకు బెస్ట్ ఫ్రెండ్. కడప జిల్లా రాజంపేటలో ఉంటాడు. ఇప్పుడది అన్నమయ్య జిల్లా పరిథిలోకి వెళ్లింది. ఈ సంగతి పక్కనపెడదాం. నాతో పాటు మరికొంతమంది స్నేహితుల్ని కలిసేందుకు అతడు హైదరాబాద్ వచ్చాడు. దాదాపు మూడేళ్ల తర్వాత రాత్రి కలిశాను (కరోనా వల్ల ఈమధ్య కలవలేకపోయాం). ఎప్పట్లానే రాజకీయాలు ఎత్తుకున్నాడు. 

అతడు నాకు 20 ఏళ్లకు పైగా తెలుసు. కరడుగట్టిన టీడీపీ. అడిగితే మా కమ్మోళ్లంతా 'అటు వైపు' అంటాడు. జగన్ కు ఓటేస్తే, అతడిది కమ్మ రక్తం కానేకాదు అని వాదించే రకం. అలాంటి వ్యక్తిలో వచ్చిన మార్పు చూసి నేను షాక్ అయ్యాను. ఇంకా చెప్పాలంటే నాకు కళ్లు బైర్లు కమ్మాయి. ఈ మూడేళ్లలో అతడు వైసీపీ అభిమానిగా మారాడు. కాదు, కాదు.. పక్కా జగన్ అభిమానిగా మారాడు.

అతడిది రాజంపేటలో వ్యవసాయం. 'అయ్యో రైతా' అని జాలిపడొద్దు. బెంగళూరులో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంపాదన కంటే వ్యవసాయంలో మనోడి ఆర్జితం ఎక్కువ. బాగా సెటిల్ అయిన కుటుంబం. ఓ రెండేళ్ల కిందట రాజంపేటలో భారీ వర్షాలు పడ్డాయంట. (నాకు గుర్తులేదు). ఆ వర్షాలకు మనోడి అరటి పంట దెబ్బతింది. ఎప్పట్లానే దిగాలుగా కూర్చున్నాడు. ఈసారికి ఇంతే అనుకున్నాడు.

కట్ చేస్తే, ఆయన గ్రామానికి సంబంధించిన విలేజ్ సెక్రటరీ, వాలంటీర్ ను వెంటబెట్టుకొచ్చాడు. తోటలో పాడైన పంట ఫొటోలు తీసుకున్నారు. మనోడి దగ్గర సంతకం తీసుకున్నారు. ఎప్పట్లానే మా స్నేహితుడు లైట్ తీసుకున్నాడు. కట్ చేస్తే, ఎకౌంట్ లో పంట నష్టం డబ్బులు పడ్డాయి. ఆ తర్వాత ఏడాదికి సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి కూడా ఠంచనుగా డబ్బులు పడ్డాయి. ఇతగాడికే కాదు, ఇతడి బంధువులకు కూడా నష్టపరిహారం దక్కింది. దీంతో షాక్ అయ్యాడు మా స్నేహితుడు.

వ్యవస్థను సృష్టించిన జగన్..

అతడు నాతో చెప్పిన మాట ఏంటంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఓ సిస్టమ్ తయారుచేశాడంట. పక్కాగా వ్యవస్థను ఏర్పాటుచేశాడట. ఆ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతోంది. కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలాగైతే అన్ని పనులు ఆటోమేటిగ్గా నడిచిపోతాయో, ఇప్పుడు గ్రామ స్థాయిలో అన్ని పనులు అలా సాగిపోతున్నాయట. 

ఎవ్వరూ ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేదు. అన్ని పనులు పద్ధతి ప్రకారం, తేదీ చెప్పి మరీ జరిగిపోతున్నాయట. ఒకప్పట్లా చేయి తడిపే అవసరం ఇప్పుడు లేదంట. ఈ విషయంలో జగన్ ముందుచూపునకు తను ఫిదా అయ్యానని చెప్పాడు నా స్నేహితుడు.

ఇన్నేళ్లలో తనకు పంట నష్ట పరిహారం ఎప్పుడూ రాలేదని, చంద్రబాబు తనకు రూపాయి కూడా ఇవ్వలేదని, ఇప్పుడు జగన్ సృష్టించిన వ్యవస్థ చూసి తనకు ఆశ్చర్యంతో పాటు సంతోషం వేస్తోందని అన్నాడు. మా కమ్మ బాబు (ఇది ఆయన వాడిన పదప్రయోగం) మేనేజ్ మెంట్ బాగా చేస్తాడని, కానీ అవి అతడికి, తమ కులంలో కొంతమందికి మాత్రమే ఇన్నాళ్లూ పనికొచ్చాయని చెప్పుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ లాంటిది చంద్రబాబు సృష్టించలేకపోయాడని అన్నాడు.

అదే సమయంలో శాపనార్థాలు కూడా..

ఇలా తన జీవితంలో తొలిసారి జగన్ ను మెచ్చుకుంటున్న నా ఫ్రెండ్ ను చూస్తూ ఆశ్చర్యపోవడం నా వంతయింది. అదే టైమ్ లో ముఖ్యమంత్రికి శాపనార్థాలు కూడా పెట్టాడు. ఒకప్పుడు రాజంపేటలో వ్యాపారం, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండేదంట. ఎప్పుడైతే తమ ఊరిని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపేశారో, అప్పట్నుంచి మార్కెట్ డల్ అయిందని అంటున్నాడు నా స్నేహితుడు. 

తనకు చెందిన ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జగన్ ను తిట్టుకుంటున్నారట. కువైట్, దుబాయ్ లాంటి అరబ్ దేశాలకు వెళ్లి సంపాదించుకునే జనాలు ఎక్కువగా ఉండడంతో, ఉన్నంతలో రియల్ ఎస్టేట్ నష్టాల నుంచి బయటపడిందని, మార్కెట్ బాగుందని చెబుతున్నాడు.

దీంతో పాటు తనకు జరిగిన ఓ నష్టాన్ని కూడా బయటపెట్టాడు. ఇన్నాళ్లూ చంద్రబాబు హయాంలో రేషన్ సరుకులు అందుకున్నాడు ఇతగాడు. ఎప్పుడైతే జగన్ రంగంలోకి దిగాడో, ఇతగాడికి రేషన్ కార్డు కట్ అయింది. అదేదో కక్షసాధింపు చర్య మాత్రం కాదు. నా స్నేహితుడికి కారు ఉంది. అలాంటి వ్యక్తికి ఉచిత రేషన్ అవసరమా? బాబు హయాంలో రేషన్ ఎంజాయ్ చేశాం, జగన్ వచ్చి అది కట్ చేశాడనేది మనోడి ఫీలింగ్. కోట్ల రూపాయలున్నా ఫ్రీగా ఏదైనా వస్తే ఆ కిక్కు వేరు కదా అంటున్నాడు.

కమ్మ ఓటు బ్యాంక్ పెరుగుతుందట.. సీట్లు తగ్గుతాయంట..

బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తన రేషన్ కార్డు తెచ్చుకుంటానని ధీమాగా చెబుతున్నాడు నా స్నేహితుడు. ఈ మాట అంటూనే ఆ వెంటనే బాబుపై తిట్లు అందుకున్నాడు. ఈసారి కూడా మా బాబు రాడు అంటూ మొహం అదోలా పెట్టేశాడు. 

ఎవరైతే ఓట్లు వేస్తున్నారో, వాళ్లందరికీ జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఓవైపు జగన్ ఇచ్చిన డబ్బులు పుచ్చుకుంటూ బాబుకు ఓటేసేంత విలన్ ఓటర్లు రాష్ట్రంలో ఎవ్వరూ లేరంటున్నాడు. జగన్ ఇచ్చే డబ్బులు తీసుకొని, చంద్రబాబుకు ఓటేసి ఆత్మసాక్షిని చంపుకోరని విశ్లేషిస్తున్నాడు.

అదే సమయంలో ఈసారి జగన్ కు సీట్లు తగ్గొచ్చని చెబుతున్నాడు ఈ రైతు కమ్ రాజకీయ విశ్లేషకుడు. ఈసారి పవన్ కు 3-4 సీట్లు వస్తాయట. చంద్రబాబుకు ఓ 20 సీట్లు పెరుగుతాయట. మిగతా సీట్లన్నీ జగన్ వే అంటూ ముక్తాయించాడు. ఏతావతా ఈయన చెప్పేదేంటంటే.. ఈసారి మా కమ్మోళ్లలో కూడా చాలామంది జగన్ కే ఓట్లు వేస్తారని.

—  మను