టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్న ట్రస్ట్ పరువును ఆ పార్టీ నేతలు చేజేతులారా తీశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ అసలు సిసలు రూపాన్ని కరోనా సెకెండ్ వేవ్ నడిరోడ్డుపై ఆవిష్కరించింది. చంద్రబాబు, లోకేశ్ నేతృత్వంలో నడుస్తున్న టీడీపీ తమపై కురిపిస్తున్న మొసలి కన్నీళ్లను ప్రజానీకం పసిగట్టేందుకు మరోసారి కరోనా మహమ్మారి అవకాశం కల్పించింది.
మరీ ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో కష్టాల్లో ఉన్న సమాజానికి హృదయపూర్వకంగా సేవలందిస్తున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ వెలవెలపోతోంది. ఈ రెండు ట్రస్ట్‌లు అందిస్తున్న సేవల గురించి మీడియా ద్వారా తెలుసుకుంటున్న ప్రజానీకం …టీడీపీ నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ మొక్కుబడిగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి పోయి, కరోనా అంతమైతే జగన్ సర్కార్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆందోళన చెందుతోందని , ఆ పార్టీ నడవడికే తెలియజేస్తోంది.
ఏపీలో కరోనా ఎప్పటికీ ఉండాలి.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటేనే తాము విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుందనే కుట్రపూరిత, దుర్మార్గపు ఆలోచనలు ఆ పార్టీ చేస్తోందనేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తూతూ మంత్రంగా తలపెట్టిన సేవలే నిదర్శనమని చెప్పక తప్పదు. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లు వేర్వేరుగా అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని ఎవరి మనస్తత్వం ఏంటో ఓ అంచనాకు రావచ్చు.
కరోనా ఉద్ధృతితో ఏపీలో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించింది. రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలిలో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆ ట్రస్టు తెలిపింది.
ఈ నాలుగు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నవే. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గంలో ఒక్కొక్కటి చొప్పున ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.
ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన సహాయక కార్యక్రమాలేంటో తెలుసుకుందాం. ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్కరూ చనిపోవద్దనే ఉద్దేశంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు అగ్రహీరో చిరంజీవి తెలిపారు. అనడమే కాదు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి రక్త, కంటి నిధి కేంద్రం నుంచి ఆక్సిజన్ వాహనాల తరలింపు ప్రక్రియను నిన్న ఆయన చేపట్టి శభాష్ అనిపించుకున్నారు.
మొదటి విడతగా అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు అందుబాటులోకి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చారు. ఈ మొత్తం ప్రక్రియను తన కుమారుడు, యువ హీరో రామ్‌చరణ్ పర్యవేక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు.
తమట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ చేస్తామని చెప్పడం ద్వారా ప్రజల పట్ల తన నిబద్ధతను, ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తా మని, అవసరానికి అనుగుణంగా పంపిణీ కొనసాగుతుందని చిరంజీవి స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యేకంగా ట్విటర్ ఖాతా తెరిచినట్టు చిరంజీవి తెలిపారు.
మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని కాజ టోల్ ప్లాజా వద్ద చిరంజీవి అభిమాని కంకణాల శివ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాకొకటి వంతున ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవలం నాలుగంటే నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న ఘనత చంద్రబాబుది. ఎప్పటికి ఏర్పాటు చేస్తారో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు స్వశక్తితో అంచెలంచెలుగా చిత్ర పరిశ్రమలో ఎదిగి, తనను ఆదరించిన తెలుగు సమాజాన్ని కష్టకాలంలో ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కనబరిచిన మానవీయత వెలకట్టలేనిది.
చిరంజీవి ఏమీ చేయక పోయినా ఎవరూ అడిగే వాళ్లు లేరు. ఆయన రాజకీయాల్లో లేరు. వచ్చే సారి అధికారంలోకి రావాలనే కాంక్ష కూడా లేదు. కానీ ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి మనసు చలించి తానున్నానంటూ సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఆపద్భాంధవుడినే అని నిరూపించుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనుకున్నదే నాలుగు ప్లాంట్లు. అది కూడా ఇంకా మీనమేషాలు లెక్కించడంలో పుణ్యకాలం కాస్త ముగిసిపోయేలా ఉంది. మరోవైపు తెల్లారి లేచింది మొదలు జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించే తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేశ్ …అంతటితో తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
ఇదే చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ విషయానికి వస్తే , మాటలు కాదు చేతల మనుషులం అని నిరూపించుకున్నారు. తమకు మనసుందని, దానికి స్పందించే గుణం ఉందని చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ తమ సేవా కార్యకలాపాల ద్వారా నిరూపించుకున్నారు.
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే మదర్ థెరిస్సా సూక్తి స్ఫూర్తిగా మెగాస్టార్ సేవలందిస్తారనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ఆక్సిజన్ సరఫరానే నిదర్శనం. ఇదే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు మాత్రం విమర్శించే పెదవులే మిన్న అనేది స్ఫూర్తిగా నిలిచినట్టుంది.
ఆర్థిక, హార్థిక వనరులతో పోల్చుకుంటే చిరంజీవి ట్రస్ట్ కంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అన్ని విధాలా బలంగా ఉంది. కానీ లేనిదల్లా కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజానీకానికి సేవ చేయాలనే మంచి హృదయం. ఇదే చిరంజీవికి విశాల హృదయం ఉండటం వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. జనానికి ఆక్సిజన్ ఇవ్వని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు మాత్రం ఏపీ ప్రజానీకం ఎందుకు రాజకీయంగా ఊపరిపోయాలో ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. మరోవైపు ఆక్సిజన్ అందిస్తున్న చిరంజీవికి సలామ్.
సొదుం రమణ