Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: ఏక్ మిని కథ

మూవీ రివ్యూ: ఏక్ మిని కథ

చిత్రం: ఏక్ మిని కథ
రేటింగ్: 2.5/5
తారాగణం: సంతోష్ శోభన్, కావ్యా థాపర్, బ్రహ్మాజి, శ్రద్ధ దాస్, సుదర్శన్, సప్తగిరి, పోసాని తదితరులు
ఎడిటింగ్: సత్య జి
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
కథ-మాటలు: మేర్లపాక గాంధి
దర్శకత్వం: కార్తిక్ రాపోలు
నిర్మాత: యూవీ క్రియేషన్స్
విడుదల టెదీ:27 మే 2021
ఓటీటీ: అమేజాన్ ప్రైం వీడియో

2021 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏడు రెండు సినిమాలు ఒకే టాపిక్ మీద వచ్చాయి. ఒకటి "ఉప్పెన"..రెండోది "ఏక్ మిని కథ". వివరంగా చెప్పక్కర్లేదు. రెండూ కూడా హీరోగారి ప్రైవేట్ పార్ట్ గురించే.

చెప్పుకోవడానికి, చర్చించుకోవడానికి ఇబ్బందిగా ఉండే అంశం ఇది. మెయిన్ స్ట్రీం తెలుగు సినిమా అంటే కుటుంబ సభ్యులంతా కలిసి చూడాలనుకుంటారు. అటువంటి జానర్లో మర్మాయవాలు, జననాంగాల చుట్టూ కథ నడపడం మనవాళ్లకే చెల్లింది.

"ఏక్ మిని కథ"- ట్రైలర్లోనే క్లారిటీ ఇచ్చేసారు అసలీ కథ దేని చుట్టూ తిరుగుతుందో.

పాయసం చేయాలనుకున్నప్పుడు పంచదార కలపాలి. ఆవకాయ చెయ్యలంటే కారం కలపాలి. దేని రుచి దానిదే. కానీ ఆవకాయలో పాయసం కలిపితే ఎలా ఉంటుంది? "ఏక్ మిని కథ" లా ఉంటుంది. ఒక జానర్లో ఇంకో జానర్ కి చెందిన టాపిక్ కలపడమన్నమాట. చక్కని హిలారియస్ ట్రీట్మెంట్ తో కథనం నడిపాడు. కానీ ఏం లాభం? కుటుంబమంతా కలిసి చూడలేం. చిన్న పిల్లలతో పంచుకోలేం. కారణం మన సొసైటీ, ముఖ్యంగా నడివయస్కులు ఇంకా అంత ఎదగలేదు (దిగజారలేదు). అసలీ అంశం ఎంచుకున్నప్పుడే పూర్తిగా డార్క్ కామెడీగా తీసుండాల్సింది. ఆ టేస్టున్న ఆడియన్సే దీని మీద దృష్టి పెడతారు.

కానీ ఈ "ఏక్ మిని కథ" కి సైకలాజికల్, మెడికల్ కలర్ ఇచ్చారు. ఇదే కలర్ తో ఆమధ్య "విక్కీ డోనర్" వచ్చింది. అది అందరినీ హత్తుకుంది. కారణం అందులో సంతానోత్పత్తి అనే సున్నితమైన, ఆర్ద్రమైన విషయం ఉంది. కానీ ఈ "ఏక్ మిని కథ" లో ఆ ఆర్ద్రత లేదు. సైజు చిన్నగా ఉన్నదని కుమిలిపోతూ కనిపించే హీరోని మొదటి నుంచి చివరిదాకా చూడడం కష్టమే. అతని ఎమోషనుతో ఆడియన్సుని కనెక్ట్ చేసేటంత పనితనం కథకుడు చూపలేదు. అది చేసుంటే విషయం వేరేగా ఉండేది. నాన్ సింక్ దినుసులతో రుచికరమైన కొత్త వంటకం తయారు చేయడం ఎలాగో నేర్పుండేవాడు.

ఇంతకీ టూకీగా కథ చెప్పుకుంటే..సంతోష్ (సంతోష్ శోభన్) కి తన అంగం చిన్నదని న్యూనతాభావంతో ఉంటాడు. పెళ్లిని వాయిదా వేస్తూ వస్తాడు. కానీ అమృత (కావ్యా థాపర్) ని చూడగానే అతని మనసు చలిస్తుంది. అమృతకీ మన సంతోష్ నచ్చుతాడు. కానీ తన చిన్నదైన అవయవం విషయం చెప్పకుండా ఆమెను మోసం చేయలేనని, అలాగని చెప్పలేనని, ఏదో విధంగా పెళ్లిని దాటవేసే ఎత్తులు వేస్తాడు. కానీ అవేమీ ఫలించవు. పెళ్లి ఎలా అవుతుంది? తర్వాత శోభనం సంగతేంటి? అసలు విషయం ఎప్పుడు తెలుస్తుంది? పర్యవసానాలు ఏమిటి? స్థూలంగా అయినా సూక్ష్మంగా అయినా కథ ఇంతే.

సంతోష్ శోభన్ ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసే ప్రయత్నం చేసాడు. కావ్యా థాపర్ చూడడానికి ఓకే తప్ప పాత్రలో బలం లేదు. హీరోని గుడ్డిగా నమ్ముతూ విధేయురాలిగా అన్నిటికీ తలూపే పాత్ర ఆమెది. బ్రహ్మాజీ, సప్తగిరి, సుదర్శన్ లు బాగానే నవ్వించారు. మందుకొట్టి, గంజాయి పీల్చే స్వామినిగా శ్రద్ధాదాస్ అదోరకంగా కనిపించింది. సుయిసైడ్ సిండ్రాం ఉన్న వ్యక్తిగా నటించనతను కూడా ఎంటెర్టైన్ చేసాడు.

పాత్రలు ప్రవర్తించే తీరు చాలా కృత్రిమంగా ఉంది. టిపికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైపులో తియ్యాలనే తపన బాగా కనిపించింది. మేర్లపాక గాంధి కథ మాత్రం టైటిల్ కి తగ్గట్టే "చిన్నది". కార్తిక్ రాపోలు దర్శకత్వం పెద్దగా ఇబ్బంది పెట్టదు. ప్రామిసింగ్ డైరక్టర్ గానే అనిపించాడు.

ఏది ఏమైనా ఓటీటీలో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కడానికి నాందిగా ఇలాంటి సినిమాలను చెప్పుకోవచ్చు. సెన్సార్ అడ్డంకి లేదు కనుక ప్రతి అవయవం చుట్టూ కథలల్లి సినిమా తీసుకోవచ్చు. ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం పిల్లలు లేకుండా "ప్రైవేట్" గా చూడండి. నిజానికి అంతలా చూసేటంత బూతేమీ లేదిందులో..కొద్ది పాటి ఇబ్బందంతే!

బాటం లైన్: హీరో గారి వ్యథ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?