అసాంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కాంగ్రెసేతర ప్రభుత్వాలు యిలా రావడం యిదే ప్రథమం. మొత్తం 126 సీట్లలో ఎన్‌డిఏకు 75 వచ్చాయి. గతంలో కంటె 11 తక్కువ. కాంగ్రెసు సారథ్యంలోని మహాజోట్కు 50 వచ్చాయి. గతంలో కంటె 11 ఎక్కువ. (అప్పుడు బిపిఎఫ్ దానితో లేదు, యీ సారి కలిసింది) ఒకటి స్వతంత్రుడికి వచ్చింది. ఎన్డిఏ 75లో బిజెపికి 60 వచ్చాయి. గతంలో కంటె 9 సీట్లు ఎక్కువ పోటీ చేసి 3.7% ఓట్లు ఎక్కువ (33%) తెచ్చుకుంది కానీ సీట్ల సంఖ్యలో మార్పు లేదు. సొంతంగా మెజారిటీ లేదు. భాగస్వాములపై ఆధారపడవలసినదే.
ఎన్డిఏ భాగస్వాముల వలన దెబ్బ తింది. అసాం గణ పరిషద్ (ఎజిపి) గతంలో కంటె 5 సీట్లు ఎక్కువగా 24వాటిలో పోటీ చేసి, గతంలో కంటె 5 సీట్లు తక్కువగా 14 తెచ్చుకుంది. ఓట్ల శాతం కూడా 0.3% తగ్గింది. 2016లో ఎన్‌డిఏలో భాగస్వామిగా వున్న బిపిఎఫ్ (బోడో పీపుల్స్ ఫ్రంట్) 3.9% ఓట్లతో 12 సీట్లు గెలుచుకుని ఎన్‌డిఏకు అండగా నిలిచింది. తర్వాతి కాలంలో ఎన్డిఏ నుంచి విడివడి, యీసారి యుపిఏతో కలిసి పోటీ చేసింది. దాని స్థానంలో వచ్చిన యుపిపిఎల్ 11 స్థానాల్లో పోటీ చేసి 3.4% ఓట్లతో 6 తెచ్చుకుంది.
సిఏఏ పెట్టినా అసాంలో మళ్లీ గెలవడం మెచ్చుకోదగిన విషయమే కానీ, ప్రత్యర్థిగా కాంగ్రెసు వున్నా బిజెపి గెలుపు యీ స్థాయిలోనే వుండడం వింతగా వుంది. అందరికీ తెలుసు, దేశంలోనే కాంగ్రెసు నామమాత్రం అయిపోతోందని, పనికిమాలిన నాయకత్వం కారణంగా దిక్కుమాలిన స్థితిలో వుందని! అంతో యింతో బలం వున్న కేరళలో కూడా గతంలో 22 స్థానాలొస్తే యీసారి 1 తగ్గి, 21 వచ్చాయి. తమిళనాడులో దాని పెర్ఫామెన్స్ బాగుంది కానీ ఆ ఘనత కూటమి నాయిక డిఎంకెకు ఎక్కువగా పోతుంది. మరి అసాంలో 26 నుంచి 29కి ఎదిగింది. సీట్లు బిజెపిలో సగం కంటె తక్కువ వచ్చినా ఓటింగు శాతంలో 3.5 మాత్రమే వెనకబడి వుంది. కాంగ్రెసు భాగస్వామి ఐన ఎఐయుడిఎఫ్ తన బలాన్ని 13 నుంచి 16కి పెంచుకుంది. సిపిఎం 1 సీటు గెలుచుకుంది. దెబ్బ తీసిన భాగస్వామి బిపిఎఫ్! దాని బలం 12 నుంచి 4కి క్షీణించింది.
ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో పుదుచ్చేరి, తమిళనాడులలో ప్రభుత్వాలు మారాయి. కేరళ, బెంగాల్‌లలో పాలకపక్షాలు గతంలో కంటె ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. కానీ అసాంలో మాత్రం బిజెపి కూటమి గతంలో కంటె తక్కువ సీట్లు తెచ్చుకుంది. ఈ మాత్రమైనా తెచ్చుకుందంటే దానికి ఇతర శాఖలతో బాటు ఆరోగ్య, ఆర్థిక శాఖలు కూడా నిర్వహించిన హిమాంత విశ్వశర్మ పనితీరే కారణమని చెప్పాలి. ఆరోగ్యమంత్రిగా కరోనా కట్టడిలో ముందుండి ప్రధాన పాత్ర వహించాడు. రాష్ట్రమంతా తిరుగుతూ మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఎన్నికల ర్యాలీలలో అతన్ని రాక్‌స్టార్‌లా చూశారు. అలాగే ఆర్థికమంత్రిగా మహిళల ఆర్థికశక్తికి దోహదపడ్డాడు.
ఈసారి ఎన్నికైతే అరుణోదయ స్కీము కింద గృహిణులకు ఏటా యిస్తున్న రూ.10 వేలను రూ.36 వేలకు పెంచుతానన్నాడు. విమెన్ సెల్ఫ్-హెల్ప్ గ్రూపులు మైక్రో ఫైనాన్స్ ఏజన్సీల నుంచి తీసుకున్న రూ.12 వేల కోట్ల ఋణాన్ని మాఫీ చేస్తానని హామీ యిచ్చాడు. ఇవన్నీ మహిళా ఓటర్లను ఆకట్టుకున్నాయి. తేయాకు తోటల ప్రాంతంలో గతంలో బిజెపికి చాలా మద్దతు లభించింది. కానీ వాగ్దానం చేసిన జీతాలు పెంచలేదని వాళ్లు కోపంగా వున్నారు. కాంగ్రెసు దాన్ని సొమ్ము చేసుకోవడానికి రూ. 351 జీతం హామీ యివ్వడంతో ఎన్నికలకు ముందు వాళ్ల జీతాలు రూ.167 నుంచి రూ.217కి పెంచాడు శర్మ. దాని కారణంగా వాళ్లు ప్రభావితం చేసే 9 సీట్లలో 2016లో ఎన్‌డిఏకు 6 వస్తే యిప్పుడు 8 వచ్చాయి. మహాజోట్కు 3 నుంచి 2 తగ్గి, 1 వచ్చింది.
రాజకీయ వ్యూహాలకు వస్తే – సిఏఏ (పౌరసత్వం చట్టం) అసాంలో ప్రధాన సమస్య. తక్కిన రాష్ట్రాలలో అది హిందూ-ముస్లిం విభజనగా చూస్తారు కానీ అసాంలో అది అసామీ-బెంగాలీ విభజనగా చూస్తారు. వలసవచ్చిన బెంగాలీలు హిందువులైనా, ముస్లిములైనా సరే వెనక్కి వెళ్లిపోవాలని, లేకపోతే అసామీ సంస్కృతి నాశనమై పోతుందని అసామీయుల ఆందోళన. ఉత్తర, ఎగువ అసాంలో ఎన్నికలను ప్రభావితం చేసే అంశమిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెరాసతో పొత్తు పెట్టుకోని పార్టీ తెలంగాణలో ఎన్నికలు పూర్తయేవరకు ఒకలా మాట్లాడి, ఆంధ్రలో ఎన్నికలు ప్రారంభం కాగానే యింకోలా మాట్లాడేది. అదే విధంగా అసాంలో తొలిదశలో ఉత్తర అసాంలో ఎన్నికలు జరిగినపుడు బిజెపి అక్కడ సిఏఏ గురించి మాట్లాడకుండా హిందూ-ముస్లిం సమస్యనే ముందుకు తెచ్చింది.
‘కాంగ్రెసు-ఏఐయుడిఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే అక్రమ బంగ్లాదేశీయులతో అసాంను ముంచెత్తుతున్న మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ముఖ్యమంత్రి అవుతాడు. అతని కంటె రెట్టింపు పెద్దదైన భాగస్వామి ఐనా కాంగ్రెసు అతనికి మద్దతిస్తుంది. జనాభాలో 34% వున్న ముస్లిములు మూడింట రెండువంతులున్న హిందువుల నెత్తికెక్కుతారు.’ అంటూ ప్రచారం చేసింది. ఆ విధంగా హిందూ, ముస్లిం అసామీ ఓట్లను ఆకర్షించింది. అక్కడ ఎన్నిక పూర్తి కాగానే యితర ప్రాంతాలకు వచ్చేసరికి బంగ్లాదేశీ హిందువులకు పౌరసత్వం యిచ్చే సిఏఏ అంశాన్ని ముందుకు తెచ్చి, బెంగాలీ హిందూ ఓట్లను సంఘటితం చేసి లాభపడింది. దీన్ని అంకెలతో చెపితే బాగా అర్థమౌతుంది. అసామీయులు నిర్ణయాత్మకంగా వున్న 36 సీట్లలో ఎన్డిఏ 32 సీట్లు 2016లోనూ, యిప్పుడూ గెలిచింది. మహాజోట్కి గతంలో 4 వస్తే యీసారి వాళ్లకు 3 రాగా 1 యితరులకు పోయింది. బెంగాలీ హిందూలు నిర్ణయాత్మకంగా వున్న 8 సీట్లలో ఎన్‌డిఏకు 7, మహాజోట్కు 1 అప్పుడూ యిప్పుడూ వచ్చాయి.
సిఏఏకు వ్యతిరేకంగా అసాంలో ఆందోళనలు చెలరేగాయి కాబట్టి, ఎగువ, ఉత్తర అసాంలో మహాజోట్ పుంజుకుంటుంది అనుకున్నారు కానీ దానికి రెండు అవరోధాలు వచ్చాయి. అసామీయత గురించి ఏర్పడి, సిఏఏకు, బిజెపికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన రెండు పార్టీలు అసాం జాతీయ పరిషద్, రాజోర్ దళ్ మహాజోట్లో చేరేందుకు తిరస్కరించి, వేరే కూటమిగా ఏర్పడి (స్నేహపూర్వకమైన పోటీ అంటూ 25 స్థానాల్లో తలపడ్డాయి కూడా) పోటీ చేశాయి. దానివలన బిజెపి వ్యతిరేక ఓటు చీలిపోయి, మహాజోట్ కొన్ని నియోజకవర్గాలలో ఓటమి పాలైంది. ఈ పార్టీలు కూడా లాభపడలేదు. రాజోర్ దళ్ నాయకుడు, ప్రస్తుతం జైల్లో వున్న అఖిల్ గొగోయ్ ఒక్కడే గెలిచాడు. మొత్తానికి బిజెపికి దోహదపడ్డారు. ఈ పార్టీలకు తోడు అజ్మల్ కొడుకు, ఎమ్మెల్యే అయిన అబ్దుర్ రహీమ్ ‘‘ఈసారి టోపీ, గడ్డం, లుంగీవాలాలతో ప్రభుత్వం ఏర్పడుతుంది.’’ అని ప్రకటించి హిందువుల్లో ముస్లిము వ్యతిరేకతను రెచ్చగొట్టాడు. దాంతో అసామీయులు బెంగాలీ వ్యతిరేకతను కూడా పక్కనపెట్టి బిజెపికి ఓటేశారు.
హిందూత్వం కోసం బిజెపికి ఓటేసినా, అసాం ఒప్పందం అమలు చేయడానికి అంటూ బిజెపితో చేతులు కలిపి, సిఏఏను అడ్డుకోలేక పోయిన ఎజిపిపై అసాం ఓటర్లు క్రోధాన్ని చూపించారు. దాని కారణంగా ఎజిపికి 0.2% ఓట్లు తగ్గి 7.9%, 5 సీట్లు తగ్గి 9 సీట్లు వచ్చాయి. కొంతకాలం అసాంను ఏలిన పార్టీకి యీ గతి పట్టింది. దాని కారణంగా ఎన్డిఏ కూటమికి గతంలో కంటె సీట్లు తగ్గిపోయాయి. కూటమి ఓట్లు తగ్గడానికి మరో కారణం బోడోలాండ్లో తగిలిన దెబ్బ. 2016లో బిపిఎఫ్ 12 తెచ్చుకుంది. దాని స్థానంలో బిజెపి తెచ్చుకున్న యుపిపిఎల్ 6 మాత్రమే సంపాదించగలిగింది. బిజెపి కూటమిలోంచి మహాజోట్లోకి గెంతిన బిపిఎఫ్ యీసారి 4 మాత్రమే గెలుచుకోగలిగింది. బోడోలాండ్లో 6 యుపిపిఎల్, బిపిఎఫ్ 4 తెచ్చుకోగా మిగిలిన 2 సీట్లు బిజెపి గెలుచుకుంది. స్నేహపూర్వకమైన పోటీ అంటూ యుపిపిఎల్నే ఓడించింది.
అన్ని రాష్ట్రాలలోనూ పర్వతప్రాంతాల్లో ఆరెస్సెస్ చేస్తున్న కృషి కారణంగా బిజెపి సీట్లు గెలుస్తోందని అనేక వ్యాసాల్లో రాశాను. పైగా యీసారి బిజెపి ఆరు కులాల వారిని షెడ్యూల్ ట్రైబ్‌గా గుర్తిస్తానని హామీ యిచ్చి వారి ఓట్లు పొందింది. అసాంలో గిరిజనులు ప్రభావితం చేయగల 10 సీట్లలో గతంలో కంటె 1 ఎక్కువగా (యితరుల నుంచి) 9 గెలుచుకుంది. మహాజోట్ అప్పుడూ యిప్పుడూ 1 తెచ్చుకుంది. బెంగాలీలు అధిక సంఖ్యలో వున్న బరాక్ లోయలోని 15 సీట్లలో బిజెపి గతంలో కంటె 2 తక్కువగా 6 తెచ్చుకుంది. మహాజోట్కు 9 వచ్చాయి. (కాంగ్రెసుకు 5, ఏఐయుడిఎఫ్కు 4). జనాభాలో ముస్లిములు 34% వున్నా బిజెపి యీ స్థాయిలో గెలవగలిగిందంటే దానికి కారణం బిజెపి హిందువుల్లో అభద్రతాభావాన్ని పెంపొందించి, లాభపడగలగడమే! మహాజోట్ గెలిస్తే అసాం ముస్లింమయం అయిపోతుందని బాగా భయపెట్టింది.
కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి ఏఐయుడిఎఫ్ ఎందుకు సిద్ధపడిందంటే, బిజెపి భయం చేత ముస్లిము నియోజకవర్గాలలో తమకెటూ సీట్లు వస్తాయి, హిందూ నియోజకవర్గాలలో కాంగ్రెసు కొన్ని సీట్లు సంపాదించి కూటమి విజయానికి సాయపడుతుంది అనుకుంది. కానీ కాంగ్రెసు తన చేతకానితనం వలన హిందూ ఓట్లను పెద్దగా ఆకర్షించలేక పోయింది. ముస్లిం స్థానాల్లోనే ప్రచారం చేసుకుంది. 95 స్థానాల్లో పోటీ 29టిలో నెగ్గితే దానిలో 16 మంది ముస్లిములే. (ఎఐయుడిఎఫ్ 16 మంది ఎమ్మెల్యేలలో 15 మంది ముస్లిములు) హిందూ-ముస్లిం పోలరైజేషన్ వలన ప్రభావితమయ్యే 6 సీట్లలో గతంలో ఎన్‌డిఏకు 5, మహాజోట్కు 1 వస్తే యీసారి రివర్స్ అయి ఎన్‌డిఏకు 1, మహాజోట్కు 5 వచ్చాయి. ఇరు వర్గాలూ వున్న స్వింగ్ సీట్లు 12టిలో ఎన్‌డిఏకు గతంలో 12 వస్తే యీసారి 10 వచ్చాయి. తక్కిన రెండూ మహాజోట్కు వెళ్లాయి.
అసాంలో గెలుపుకి ప్రధాన శిల్పి శర్మయే. అతను తను ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టడంతో బిజెపి కాస్త తర్జనభర్జన పడింది. మూడు రోజులైనా ఎటూ తేల్చలేదు. ఎందుకంటే మళ్లీ ఎన్నికైన ముఖ్యమంత్రిని బిజెపి సాధారణంగా మార్చదు. హరియాణాలో సరైన గెలుపు తేలేకపోయినా ఖట్టార్నే కొనసాగించింది. శర్వానంద్ సోనోవాల్ పాలనపై ఆక్షేపణ ఏమీ లేదు. అయినా మార్చారంటే దానికి కారణం ఆ సీటు కోసం శర్మ పట్టుపట్టడం. అతను ఒరిజినల్‌గా కాంగ్రెసువాడు. తరుణ్ గొగోయ్ శిష్యుడు.
గురువుని దింపేసి తనను ముఖ్యమంత్రిని చేయమని అడగడానికి దిల్లీ వెళ్లి రాహుల్‌ని కలిస్తే అతను కుక్కపిల్లతో ఆడుకుంటూ యితన్ని పట్టించుకోలేదు. చాలాసార్లు యిలా జరిగేసరికి చిర్రెత్తి 2015లో బిజెపిలో చేరాడు. అసాం ఒకటే కాదు, ఈశాన్యభారతంలో బిజెపి విస్తరించడానికి ప్రధాన కారకుడయ్యాడు. మొన్న ఎన్నికల ఫలితాలు వస్తూన్నపుడు అతను టీవీలో ‘రాహుల్ కేరళలో తిరుగుతున్నాడట, అయితే అక్కడ కాంగ్రెస్ మటాష్’ అన్నాడు.
ఇప్పుడు తాము ముఖ్యమంత్రి పదవి యివ్వకపోతే పార్టీ వదిలిపోతాడేమోనని భయం వేసి వుంటుంది బిజెపికి. టిక్కెట్ల పంపిణీ కూడా అతని చేతుల మీదుగానే జరిగింది కాబట్టి బయట వదిలేస్తే ప్రమాదమని, పార్టీ చీల్చగల ఘటికుడని జంకి ముఖ్యమంత్రిని చేశారు. శర్వానంద్‌ను ఎక్కడ ఎకామడేట్ చేస్తారో తెలియదు. చూడబోతే కాంగ్రెసు పార్టీకి చావుంది కానీ, కాంగ్రెసు వాదులకు లేనట్లుంది. వాళ్లు కండువాలు మార్చి, బిజెపి నాయకులుగా అవతారమెత్తుతున్నారు. నేటి బిజెపిలో ఆరెస్సెస్ మూలాలున్న వారి కంటె కాంగ్రెసు మూలాలున్నవారు ఎక్కువమంది వుండవచ్చు. అవే ట్రిక్కులు, అవే ఫిరాయింపులు, అవే ప్రలోభాలు. ఏది ఏమైనా శర్మ పాలనాదక్షత కలిగినవాడు కాబట్టి అసాంను చక్కగా పాలిస్తాడనే ఆశిద్దాం. (ఫోటో – ఎన్నికల ప్రచారంలో శర్మ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)