అప్పుడు లాక్ డౌన్ వద్దు.. ఇప్పుడు అదే ముద్దు!

భారత్ లో సెకండ్ వేవ్ విజృంభించిన తర్వాత తొలిసారిగా ఆంక్షలు విధించిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆలస్యంగా కర్ఫ్యూ వైపు మొగ్గు చూపిన రాష్ట్రం తెలంగాణ. పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో ఆంక్షలు విధించినా కూడా…

భారత్ లో సెకండ్ వేవ్ విజృంభించిన తర్వాత తొలిసారిగా ఆంక్షలు విధించిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆలస్యంగా కర్ఫ్యూ వైపు మొగ్గు చూపిన రాష్ట్రం తెలంగాణ. పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో ఆంక్షలు విధించినా కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. కర్ఫ్యూ ప్రతిపాదనలు వచ్చినా కూడా.. పక్క రాష్ట్రాల్లో పెట్టారు కదా, కేసులేమైనా తగ్గాయా అంటూ లాజిక్ తీశారు. చివరగా హైకోర్టు మొట్టికాయ వేయబోతోందనే దశలో.. హడావిడిగా అన్నీ బంద్ అంటూ షాకిచ్చారు.

రంజాన్ కంటే ముందే కర్ఫ్యూ అమలులోకి తెచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు అంటే కేవలం 4గంటలు మాత్రమే సడలింపు ఇచ్చారు. మొదట్లో ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే అంబులెన్స్ లు ఆపడం ద్వారా తెలంగాణ కర్ఫ్యూ మరింతగా వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత సడలింపు టైమ్ లో కూడా ఈ-పాస్ అంటూ కొత్త విధానం తీసుకొచ్చి మరింతగా జనాల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేశారు.

గతంలో లాక్ డౌన్ నిబంధనలు పూర్తయ్యే రోజుకి కూడా పొడిగింపా, లేదా సడలింపా అనే నిర్ణయం తీసుకోడానికి కేసీఆర్ వెనకాడేవారు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా అలర్ట్ అయ్యారు. కర్ఫ్యూ వల్ల వచ్చిన ప్రయోజనాలను గుర్తించగలుగుతున్నారు. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గడానికి కూడా కర్ఫ్యూయే కారణం అని తేలడంతో.. రెండోసారి పొడిగించారు. ఇప్పుడు మూడోసారి కూడా పొడిగించేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఈనెల 30న జరిగే మంత్రిమండలి సమావేశంలో కర్ఫ్యూ పొడిగింపు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. సడలింపులకి ఏమాత్రం అవకాశం లేదని అంటున్నారు. అదే సమయంలో రైతులు, ఇతర వర్గాల వారు ఇబ్బంది పడకుండా కొన్ని వెసులుబాట్లు మాత్రం ఉంటాయని చెబుతున్నారు.

గతంలో కర్ఫ్యూ అమలు కంటే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించే కేసీఆర్ ఎక్కువగా ఆలోచించేవారు. అందుకే ఆంక్షలు పెడితే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోతాయని, తద్వారా ప్రజలు ఇబ్బంది పడేవారని చెప్పేవారు కేసీఆర్. అయితే స్వయంగా కేసీఆర్ కరోనాబారిన పడి కోలుకున్న తర్వాత, ఆయన దృక్పథంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.

ఆర్థిక పరిస్థితి పక్కనపెట్టి.. ముందు కేసుల సంఖ్య తగ్గేందుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారుల్ని ఆదేశించారు. ఆఘమేఘాలమీద కర్ఫ్యూ అమలులోకి తెచ్చారు. కేవలం 4గంటలు మాత్రమే వెసులుబాటు కల్పించి పగడ్బందీగా నిబంధనలు అమలు చేశారు. ఇంటింటికీ కరోనా మందుల కిట్ పంపిణీ చేశారు, ఫీవర్ సర్వే చేయించారు. కర్ఫ్యూ, లాక్ డౌన్ విషయంలో కేసీఆర్ ఆలోచన పూర్తిగా మారిందనడానికి ఇవే నిదర్శనాలు. అప్పుడు కర్ఫ్యూ వద్దు అన్న కేసీఆరే.. ఇప్పుడు ముద్దు అనడం విశేషం.