తాను బీజేపీ మనిషినని టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం కేసుకు సంబంధించి ఇవాళ తనయుడు మంచు విష్ణు, మనోజ్‌తో కలిసి ఆయన తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ముందుగా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పాదయాత్రగా కోర్టుకెళ్లడం విశేషం.
ఈ సందర్భంగా మీడియాతో మోహన్‌బాబు రాజకీయాలపై మనసులో మాట చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటి వ్యక్తినన్నారు. బీజేపీ వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్నారు. ఇదిలా వుండగా గతంలో ప్రధాని మోడీని కుటుంబ సమేతంగా మోహన్‌బాబు కలుసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో ఆయన వైసీపీ తరపున ప్రచారం చేశారు.
టీడీపీని ఓడించాలని, చంద్రబాబు మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించాలంటూ మంచు మోహన్‌బాబు ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ పోటీ చేసిన మంగళగిరిలో కూడా మోహన్‌బాబు విస్తృతంగా ప్రచారం చేయడం తెలిసిందే.
మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మోహన్‌బాబుకు బంధుత్వం వుంది. జగన్ చిన్నాన్న కూతురిని మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు వివాహమాడారు. పలు సందర్భాల్లో జగన్‌ను విష్ణు కలిసి చర్చించారు. “మా” ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ తనకు బావ అవుతాడని విష్ణు చెప్పడంపై అప్పట్లో ప్రకాశ్‌రాజ్ వర్గం అభ్యంతరం చెప్పింది. సీఎంతో బంధుత్వాన్ని మంచు విష్ణు వాడుకుంటున్నారని ప్రకాశ్‌రాజ్ విమర్శలు చేశారు.
ఇదిలా వుండగా చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి, జగన్ ప్రభుత్వం వచ్చినా ….శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థకు బకాయి సొమ్ము పూర్తిస్థాయిలో రానట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాజ్యసభ, టీటీడీ చైర్మన్ తదితర పదవుల్లో ఏదో ఒకటి మోహన్‌బాబుకు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవీ దక్కలేదు.
మొత్తానికి జగన్ పాలనపై మోహన్‌బాబు అసంతృప్తి లేరని పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చెప్పాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తాను బీజేపీ మనిషినని ప్రకటించడం ద్వారా, వైసీపీతో సంబంధం లేదని స్పష్టం చేసినట్టైంది.