తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 8 నెలల తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లారు. గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య వ్యవహారం ఉప్పునిప్పులా ఉంది. సేవారంగం నుంచి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఈ మేరకు ప్రతిపాదనను గవర్నర్‌కు కేసీఆర్ ప్రభుత్వం పంపింది. దాన్ని గవర్నర్ తిరస్కరించడం వారి మధ్య విభేదాలకు బీజం వేసింది.
ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకుండా ప్రభుత్వం తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ఆ తర్వాత కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్టైంది. ఉగాది వేడుకలకు సీఎం, మంత్రులను ఆహ్వానించినా వెళ్లలేదు. ఇటీవల రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ను గవర్నర్ నిర్వహించి కేసీఆర్ సర్కార్‌కు మరింత కోపాన్ని తెప్పించారు.
ఈ నేపథ్యంలో కొన్ని నెలల తర్వాత రాజ్‌భవన్‌లో కేసీఆర్ అడుగు పెట్టడం చర్చనీయాంశమైంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారానికి సీఎం, మంత్రులు వెళ్లారు. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఇద్దరూ పక్కపక్కనే కూచోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. గత ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లడం విశేషం.