కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సాయాన్ని ముస్లింలు తిరస్కరించారు. ఇది పట్టణంలో చర్చకు దారి తీసింది. చేసిందంతా చేసి, వ్యతిరేకత పోగొట్టుకోడానికి డబ్బుతో ప్రలోభ పెడతారా? అని వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని గవిని సర్కిల్ నుంచి ఎర్రగుంట్ల సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ మార్గంలోని దర్గా చెట్టు గోడ కూల్చివేతకు అధికారులు దిగారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా తమకు తెలియకుండా దర్గాపై ఎక్సకవేటర్ వెళ్లడాన్ని ముస్లింలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలో ముస్లింల ఓట్లు 30 వేలున్నాయి. మొదటి నుంచి వీరంతా వైసీపీ అనుకూల ఓటర్లుగా గుర్తింపు పొందారు. పైగా దర్గా ఉన్న వార్డుకు వైసీపీ నాయకుడు వైఎస్ మహమ్మద్ గౌస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దర్గా చెట్టు గోడ కూల్చివేత చివరికి చినికి చినికి గాలివానగా మారిన చందమైంది. ముస్లింలలో ఈ స్థాయి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అసలు ఊహించలేదు.
టీడీపీ ముస్లిం నాయకుడు ముక్తియార్ సోమవారం పుట్టిన రోజు. ఆ వేడుకల్లో టీడీపీ శ్రేణులుంటాయని, అదును చూసి దర్గా గోడ కూల్చితే అడ్డుపడేవాళ్లెవరూ ఉండరని మున్సిపల్, పోలీస్ అధికారులు భావించి రంగంలోకి దిగారు. అనూహ్యంగా వైసీపీకి చెందిన ముస్లిం కౌన్సిలర్లు ఎదురు తిరిగారు. సొంత పార్టీ ముస్లిం నేతలే ఎదురు తిరుగుతారని ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు ఊహించలేదు. పట్టణంలోని ముస్లింలంతా ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అనుకున్నారు. ఇందులో భాగంగా కూల్చిన దర్గా చెట్టు గోడ పునర్నిర్మాణానికి ముందుకొచ్చారు. ముస్లింలపై నయాపైసా కూడా భారం పడకుండా పునర్నిర్మాణ పనులు చేసి పెడతానని ఎమ్మెల్యే మతపెద్దలతో అన్నారు. అందుకు వారు ససేమిరా అన్నట్టు తెలిసింది. మీరొద్దు, మీ డబ్బూ వద్దు అని తిరస్కరించినట్టు సమాచారం.
దర్గాను అద్భుతంగా పునర్నిర్మించుకునే సత్తా తమకు ఉందని ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారని సమాచారం. ప్రస్తుతం ప్రొద్దుటూరులో దర్గా పునర్నిర్మాణ పనులు ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. ఇంత కాలం ఎమ్మెల్యే చేసిన సాయం అంతా ఏమైందని రాచమల్లు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.