ఎలక్షన్ టీమ్ అన్నారు. మరికొంతమంది బి-టీమ్ అన్నారు. ఇలా ఎన్నో వాదనలు, మరెన్నో విశ్లేషణల మధ్య ఏపీలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది.
కొత్త మంత్రులు పదవుల్లోకి వచ్చి 2 నెలలు దాటింది. శాఖల పరంగా వాళ్ల పనితీరు ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే, ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడంలో, ధాటిగా మాట్లాడ్డంలో 'జగన్ సెకెండ్ బ్యాచ్' విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్తగా ఎంతమంది.. మెప్పించింది ఎంతమంది?
జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఏకంగా 14 మంది కొత్తవారికి చోటు దక్కింది. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ సాగిన ఈ మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్తగా మంత్రులైన వాళ్లలో చాలా తక్కువమంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, మీడియాలో నలుగుతున్నారు. మిగతా వారంతా ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి. వీళ్లలో కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, సదరు వ్యక్తి లేదా మహిళా నేత, మంత్రి అని చెప్పేవరకు జనం గుర్తుపట్టడం లేదు.
మలివిడత కేబినెట్ విస్తరణలో ధర్మాన, రాజన్నదొర, అమర్నాధ్, ముత్యాలనాయుడు, జోగి రమేష్, కారుమూరు నాగేశ్వరరావు, విడదల రజనీ, కాకాణి, రోజా, ఉషశ్రీ చరణ్ లాంటి వాళ్లు మంత్రులయ్యారు. వీళ్లలో కొంతమంది మాత్రమే ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడంలో సక్సెస్ అవుతున్నారు. అంబటి రాంబాబు, అమర్నాధ్, రోజా లాంటి ముగ్గురు నలుగురు తప్పిస్తే మిగతావాళ్లంతా స్తబ్దుగా కనిపిస్తున్నారు.
అదే పాత మంత్రిమండలిలో తీసుకుంటే… పేర్ని నాని, కొడాలి నాని నుంచి పదుల సంఖ్యలో మంత్రులు ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ, వాళ్ల కుయుక్తుల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ మీడియాలో హైలెట్ అయ్యారు. కొత్త టీమ్ లో ఆ సంఖ్య తగ్గింది.
ఇప్పటికీ పాత మంత్రులదే హవా..
పేరుకు నూతన మంత్రిమండలి అయినప్పటికీ ఈ విషయంలో ఇప్పటికీ పాత మంత్రులదే హవా. తొలి విడతలో ఎవరైతే మంత్రలుగా చలామణి అయి, మలి విడతలో తిరిగి తమ మంత్రి పదవులు నిలబెట్టుకున్నారో వాళ్లు మాత్రమే ఈసారి కూడా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డి లాంటి వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీళ్లకు రోజా, అంబటి, అమర్నాధ్ తోడయ్యారంతే.
ఇది ఎన్నికల టీమ్ అనిపించుకుంటుందా?
కొత్త మంత్రివర్గ ఏర్పాటు టైమ్ లో వినిపించిన ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు. ఇది జగన్ ఎలక్షన్ టీమ్ అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. నూతనంగా ఏర్పాటైన కేబినెట్ తోనే జగన్, ఎన్నికలను ఎదుర్కొంటారని, ప్రతిపక్షానికి చెక్ చెబుతారని భావించారు. కానీ జగన్ అవేవీ ఆలోచించలేదు.
నూతన మంత్రివర్గ కూర్పులో కేవలం సామాజిక న్యాయాన్ని పాటించారంతే. అందుకే ఇది వైసీపీ ఎన్నికల టీమ్ కాదు.
అసలు సమస్య ఇదే!
కొత్త మంత్రివర్గంలో ఎక్కువమంది ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడం లేదు. దీనికి సమాధానం సుస్పష్టం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తమతమ నియోజకవర్గాలపై ఎమ్మెల్యేలతో పాటు, ఈ మంత్రులంతా దృష్టి పెట్టారు. తమ నియోజకవర్గాల్లో మరింత బలం పుంజుకునే క్రమంలో వీళ్లంతా మీడియాకు దూరమయ్యారు.
నిజానికి ఇది కూడా జగన్ ఇచ్చిన టార్గెట్టే. ఇప్పట్నుంచే నియోజకవర్గాల్లో తిరగాలని, ప్రజలకు మరింత దగ్గరవ్వాలంటూ జగన్ ఇచ్చిన సూచనల మేరకు మంత్రులంతా తమ నియోజకవర్గాల్లో కలియతిరిగే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రోజా, అంబటి లాంటి వాళ్లు మినహాయిస్తే, మిగతా వాళ్లంతా మీడియా కంటికి దూరమయ్యారు. అంతే తేడా.