పృధ్వి.. మొన్నటివరకు జై జగన్ అన్నాడు, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేశాడు. రాజశేఖర్, జీవిత, అలీ.. వీరంతా ఫుల్ టైమ్ రాజకీయాలు చేయరు. అది జగన్ కు నచ్చదు. ఇక మోహన్ బాబు.. పేరుకు జగన్ బంధువే అయినప్పటికీ, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఆయనకే తెలీదు.
తెలంగాణ మంత్రి ట్వీట్ వేస్తే ఆహా ఓహో అంటూ కీర్తిస్తారు సినీ జనం. ఏపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఒక్కరు కూడా మాట్లాడరు. తెలంగాణలో అధికారిక కార్యక్రమాలకి పిలిచిందే తడవుగా పరిగెత్తుకు వెళ్తారు. ఏపీ నుంచి మాత్రం ఎలాంటి ఆహ్వానం తమకు రాకూడదని కోరుకుంటారు.
సినిమావాళ్లంతే.. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలీదు.. జగన్ సీఎం అయిన తర్వాత ఎవరూ వచ్చి కలిసిన దాఖలాలు లేవు. సినిమా టికెట్ల వ్యవహారంతో సమస్య తమదాకా వస్తే పొలోమంటూ బ్యాచ్ లు బ్యాచ్ లు గా వచ్చి కలిశారు. పోనీ ప్యాచప్ అయిపోయిందని అనుకునే లోపే.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు.
తెలంగాణలో టీ హబ్ ప్రారంభోత్సవం అంటూ తాజాగా మంత్రి కేటీఆర్ వేసిన ట్వీట్ ని సూపర్ స్టార్ల దగ్గర్నుంచి రైజింగ్ స్టార్ల వరకు అందరూ రీట్వీట్ చేశారు. కేటీఆర్ సూపర్, కేటీఆర్ విజనరీ, ఆయనకు ఆయనే సాటి అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. కనీసం ఏపీ విషయంలో ఎప్పుడైనా అలాంటి పని చేశారా..?
మరీ పొగడక్కర్లేదు కానీ దిశ యాప్ ని కేంద్రం మెచ్చుకున్నప్పుడైనా, సచివాలయ వ్యవస్థను కేంద్రం ప్రశంసించినప్పుడైనా, కరోనా కాలంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపు వచ్చినప్పుడైనా.. కాస్త స్పందిస్తే బాగుండేది. ఇప్పుడు చెప్పుకున్న ఏ ఒక్క సందర్భంలోనూ సినీ జనం స్పందించలేదు. తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరించారు. ఏపీ జనం, ఏపీ ప్రభుత్వం తమది కాదన్నట్టు ఊరుకున్నారు.
జగన్ తో సినీజనం సంబంధాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ జనాల్ని నమ్ముకున్నారు తప్ప, సినీజనం క్రేజ్ ను నమ్ముకోలేదని, అందుకే ముందు నుంచి సెలబ్రిటీల్ని ఆయన పక్కన పెట్టారని అంటున్నారు. అవసరం ఉంటేనే సినిమా జనాలు దగ్గరకొస్తారని, ఆ తర్వాత పట్టించుకోరనే విమర్శ ఉంది. ఈ విషయం జగన్ కు బాగా తెలుసని అంటున్నారు. సినిమా వాళ్లపై జగన్ తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు సమర్థనీయమేనంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
చంద్రబాబు హయాంలో పుష్కరాలైనా, అమరావతి పునాదులైనా.. టాలీవుడ్ టచ్ ఉండాల్సిందే. కానీ అలాంటి హంగామా వల్ల జనంలో బాబు పలుచనయ్యారు. జగన్ అలాంటి ఆర్భాటాలకు పోవట్లేదు. థియేటర్లోనే సినిమావాళ్లు హీరోలు. కానీ జగన్ రియల్ హీరో. ఏపీ మొత్తానికి హీరో. అందుకే ఆయన క్రేజ్ ముందు సినిమావాళ్ల క్రేజ్ పనికిరాదు, ఆయనకు సినిమావాళ్ల పొగడ్తలు అవసరం లేదు.
రెండేళ్ల తర్వాత టీడీపీదే అధికారం అని చెబుతున్న రాఘవేంద్రరావు అయినా, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవ్వడంటున్న అశ్వనీదత్ అయినా, అసలు జగన్ కి అధికారమే దక్కకుండా చేస్తానని సవాళ్లు విసిరిన పవన్ కల్యాణ్ అయినా.. జగన్ అనే మేరుపర్వతం ముందు దిగదుడుపే. వారి వారి రంగాల్లో వారు తోపులే కావొచ్చు, కానీ జగన్ ముందు మాత్రం ఆ కుప్పిగంతులు పనికిరావు.