సినీ రంగమంటే అంతే మరి. మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా నటించాల్సి వుంటుంది. ఇష్టమైనవి మాత్రమే చేస్తానని భీష్మించుకుంటే మాత్రం…జీవితంలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేసే అవకాశం రాదు, ఇవ్వరు. ఈ క్లారిటీతో వచ్చిన వాళ్లకు మాత్రమే సినిమా అవకాశాలు దక్కుతాయనేది జగమెరిగిన సత్యం.
అయితే తనకిష్టం లేకపోయినా…మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో, కాదనలేకపోయానని హీరోయిన్ రెజీనా చెప్పుకొచ్చింది. హీరోయిన్ రెజీనాకు అంతంత మాత్రంగానే సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రెజీనా కేవలం ఓ పాటలో మాత్రమే కనిపిస్తుంది. ఆ పాట ఓ ఐటమ్ సాంగ్. అయితే ఐటమ్ సాంగ్ అంటే జనాలు మరోలా అర్థం చేసుకుంటారనే భయంతో రెజీనా దానికో ప్రత్యేక పేరు పెట్టింది. తాను నటిస్తున్నది స్పెషల్ సాంగ్ అని ఆమె ప్రచారం చేస్తోంది.
తానొక హీరోయిన్ ఇమేజ్‌తో కొనసాగుతూ కేవలం ఓ ఐటమ్/ స‌్పెషల్ సాంగ్‌లో మాత్రమే కనిపిండం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆమె మనసులో దాచుకోలేదు. బహిరంగంగానే చెబుతోంది. అయితే మెగాస్టార్ సినిమా కావడంతో కాదనలేక ఒప్పుకున్నానని మనసులో మాట బయటపెట్టింది. భవిష్యత్‌లో ఇలాంటివి చేయనని ఆమె నర్మగర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.