నీతి కథాసారం: తెదేపా తాబేలు- వైకాపా కుందేలు

తాబేలు-కుందేలు కథ తెలియని వాళ్లుండరు. ఊహ తెలుస్తున్నప్పుడే పిల్లలకి చెప్పే నీతి కథ ఇది. పోటీదారుడిని తక్కువంచనా వేసి కునుకు తీస్తే ఏమౌతుందో కుందేలుకి పందెం ఓడిపోయాక గాని అనుభవంలోకి రాలేదు.   Advertisement ఇప్పుడెందుకో…

తాబేలు-కుందేలు కథ తెలియని వాళ్లుండరు. ఊహ తెలుస్తున్నప్పుడే పిల్లలకి చెప్పే నీతి కథ ఇది. పోటీదారుడిని తక్కువంచనా వేసి కునుకు తీస్తే ఏమౌతుందో కుందేలుకి పందెం ఓడిపోయాక గాని అనుభవంలోకి రాలేదు.  

ఇప్పుడెందుకో ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ-తెదేపా తీరు చూస్తే ఆ కథ గుర్తొస్తోంది. 

ఇక్కడ తాబేలు పొజిషన్లో తెదేపా, కుందేలు స్థానంలో వైకాపా ఉన్నాయి. 

వైకాపాది కడుపు నిండిన బేరంలా ఉంది… భయం లేదు, బెంగ లేదు. జనం తనతోనే ఉన్నారని జగన్ మోహన్ రెడ్డికి పూర్తిగా అనిపిస్తోంది. తాజాగా ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం కూడా అలా అనిపించడానికొక కారణం. 

ఆ మధ్యన మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రానున్న ఎన్నికల్లో 175 స్థానాలూ గెలిచే విధంగా పోరాడాలని సందేశమిచ్చారంటే ముఖ్యమంత్రి గారికి ఎంతటి ఆత్మవిశ్వాసముందో అర్థమవుతోంది. 

అయితే ఆ ఆత్మవిశ్వాసం అశ్రద్ధకి దారితీస్తోందా? ఇది గమనించాలి. 

వైకాపా సొషల్ మీడియా విభాగం కాని, డిజిటల్ మీడియా వింగ్ కానీ కునుకు తీస్తున్నట్టే ఉంది. జనాన్ని ఉత్తేజపరచాలంటే ముందు తమని తాము ఉత్తేజ పరుచుకోవాలి. అది లేదసలు. 

వీళ్లే కాదు..హార్డ్ కోర్ వైకాపా అభిమానులైన కొందరు సోషల్ మీడియా యోధులు కూడా ప్రస్తుతం ఆవులిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. జగన్ మోహన్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఒలకబోసి ఎంత చేసినా వన్ వే ట్రాఫిక్కే తప్ప అటునుంచి కనీసం వెన్నుతట్టడం కూడా లేకపోవడమే. 

అది పక్కన పెట్టి అభిమానంతో ఆదుకోవాలనుకున్నా అంతటి అపాయమేమీ పార్టీకి లేదన్న ఫీలింగ్ వీళ్లకి కూడా వచ్చేసింది. 

ఇదిలా ఉంటే తెదాపా ఎన్నారై విభాగం వాళ్లు జనానికి మెయిల్స్ పంపి పలకరిస్తున్నారు. తమ పోర్టల్లో సభ్యత్వం గురించి ప్రొమోట్ చేసుకుంటున్నారు. నిజానికి ఇదంతా తెదాపా మీద అభిమానంతో, మళ్లీ ఆ పార్టీకి ఊపిరూదాలని చేస్తున్న ప్రయత్నం. 

“ఓస్..అదొక ప్రొమోషనా? దాని వల్ల మా కుర్చీ ఎందుకు కదులుతుంది?” అని అనుకోవచ్చు వైకాపా వారు. 

ఇక్కడే తాబేలు-కుందేలు కథ గుర్తు తెచ్చుకోవాలి. నెమ్మదిగా పాక్కుంటూ తెదాపా ఒక స్థానాన్ని చెరుకుంటుందేమో..అంతకన్నా ముందుగా మనం చేరుకోవాలనే ఆలోచన వైకాపాకి ఉండాలి తప్ప..ఆవులిస్తూ, కునుకు తీస్తూ కూర్చుంటే తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. 

వైకాపా నిద్రలేవాలి. పూర్తిస్థాయిలో శక్తుల్ని కూడబలుక్కోవాలి. ప్రత్యర్థులు మెలకువగా ఉన్నప్పుడు కునుకుతీయడం యుద్ధనీతిలో తెలివైన పని అనిపించుకోదు. 

శ్రీనివాసమూర్తి