సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరు వైసీపీకి కంచుకోట. అక్కడ వైసీపీ తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరినీ నిలిపినా ఎమ్మెల్యేగా గెలుస్తారనే టాక్. అక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చాలా బలహీనంగా వుంది. టీడీపీలో నాయకులెంత మంది ఉన్నారో అన్ని గ్రూపులున్నాయి. టీడీపీ బలోపేతం కంటే నాయకత్వంపైనే ప్రేమ ఎక్కువ. వైసీపీకి ఇది బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా వైసీపీ ఏకపక్షంగా ఫలితాలు సాధిస్తోంది.
వైసీపీలో నాయకులు ఎక్కువై తమలో తామే కలహించుకుంటున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా పరస్పరం అణిచివేతకు పాల్పడేందుకు వైసీపీ నాయకులు పరస్పరం సిద్ధంగా ఉన్నారు. తాజాగా ప్రొద్దుటూరు పట్టణంలో దర్గా చెట్టు గోడ కూల్చివేత వైసీపీలో అంతర్గత విభేదాలను రోడ్డున పడేసింది. ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని గవిని సర్కిల్ నుంచి ఎర్రగుంట్ల సర్కిల్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కమిషనర్ రమణయ్య, డీఎస్పీ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో దర్గా చెట్టు గోడను కూల్చివేశారు.
దీనిపై ప్రొద్దుటూరు ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ తరహా బుల్‌డోజర్ల పాలన సాగిస్తారా? అంటూ అధికార పార్టీకి చెందిన ముస్లిం కౌన్సిలర్లు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ఆ ఏరియా కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ ఎక్సకవేటర్‌కు అడ్డం పడ్డాడు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి అధికార పార్టీకి చెందిన మిగిలిన మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ చైర్మన్ ఖాజా, మునీర్, కంకరగౌస్, ఇర్ఫాన్‌బాష తదితరులతో పాటు పెద్ద ఎత్తున ముస్లింలు సంఘటన స్థలం వద్దకు వెళ్లారు. ముస్లిం మత పెద్దలతో కనీసం సంప్రదించకుండానే కూల్చివేత చర్యలు ఎలా చేపడతారని ప్రశ్నించారు.
వీరికి ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గీయులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి (సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు), ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సేఠ్ గురివిరెడ్డి తదితరులు మద్దతుగా నిలబడడం గమనార్హం. కేవలం ఇద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే, ఆయన బామ్మర్ది బంగారురెడ్డిపై పరోక్షంగా శివచంద్రారెడ్డి, సేఠ్ గురివిరెడ్డి విమర్శలు గుప్పించారు. దర్గా వద్ద బైఠాయించిన ముస్లిం కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేసి రాజుపాళెం పీఎస్‌కు తరలించారు.
ఈ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి జగన్ వర్గీయులు తీసుకెళ్లినట్టు సమాచారం. వైసీపీకి చెందిన ముస్లిం కౌన్సిలర్లను అరెస్ట్ చేయడంపై ఎంపీ అవినాష్‌రెడ్డి సీరియస్ అయ్యినట్టు తెలిసింది. వెంటనే వారిని వదిలిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో వారిని పోలీసులు విడిచిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ వారు పట్టణంలోని ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు. తన వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని గ్రహించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
తాము అధికార పార్టీలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అని ఎమ్మెల్యేను ముస్లిం కౌన్సిలర్లు ప్రశ్నించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్యే ఎదుట నిలబడడానికే భయపడే కౌన్సిలర్లు, నేడు ప్రశ్నించే పరిస్థితి. కూల్చివేతకు కారణమైన కమిషనర్ రమణయ్య, డీఎస్పీ ప్రసాద్‌రావులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆ ఇద్దరినీ బదిలీ చేయాలని వైసీపీ ముస్లిం కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అయితే వారిద్దరి తరపున తాను క్షమాపణ చెబుతానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నప్పటికీ వారు అంగీకరించలేదు. అయితే ఎమ్మెల్యే రాచమల్లు తనకు వ్యతిరేకత తెచ్చుకునేంత అమాయకుడు కాదని, కానీ పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేనట్టే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో టిప్పుసుల్తాన్ విగ్రహానికి సంబంధించిన వివాదంలో ముస్లింల తరపున ఎమ్మెల్యే గట్టిగా నిలబడ్డాడు. అలాగే ముస్లింల కోసం భారీ మొత్తంలో సొంత నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. కానీ దర్గా విషయంలో మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పరిస్థితులు తయారయ్యాయి. ఎమ్మెల్యే వ్యతిరేక కేంద్రంగా పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావడానికి దర్గా వివాదం కలిసొచ్చింది. అంతిమంగా ఇది వైసీపీకి నష్టదాయకమనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.