కాపులను రాజకీయాలకు, ఓట్లకే వాడుకుంటున్నాయని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. విశాఖలో తాజాగా సమావేశమైన కాపు నాయకులు ఏపీలోనూ, ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ కాపుల రాజకీయ పరిస్థితులు, అవకాశాల మీద కీలక చర్చలు జరిపారు. కాపులకు ఏ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తే వారికే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని కుండబద్ధలు కొట్టారు.
ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యధిక అసెంబ్లీ సీట్లు కాపులకు కేటాయించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తమకు రాజకీయంగా సామాజికంగా న్యాయం చేసే వారికే తమ సమర్ధన ఉంటుందని కూడా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో కాపుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలుగా భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, విశాఖ నార్త్, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి సహా మరికొన్ని ఉన్నాయి. వీటిలో ప్రస్తుతానికి నాలుగు చోట్ల కాపులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఇపుడు మొత్తం సీట్లలో మెజారిటీ తమకే కేటాయించాలని కాపులు పట్టుపడుతున్నారు.
అలాగే రాష్ట్రంలో కూడా కాపులకు బలమున్న చోట వారికే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు కార్డు బలంగా పనిచేస్తుందని అన్ని రాజకీయాలలో చర్చ సాగుతున్న సమయంలో ఈ తాజా డిమాండ్ కాక రేపుతోంది. ఒక హొటల్ లో సాగిన ఈ ఆత్మీయ భేటీకి రాజకీయలను పక్కన పెట్టి మరీ కాపు నాయకులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.