మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గత కొంత కాలంగా చాలా అసహనంగా ఉంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సందర్భంలో అందరినీ మారుస్తున్నారని ఆయన భావించారు. అందుకు విరుద్ధంగా జగన్ నిర్ణయం తీసుకోవడం బాలినేనిని షాక్‌కి గురిచేసింది. ముఖ్యంగా తన జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్‌ను తిరిగి మంత్రిగా కొనసాగించడాన్ని బాలినేని, ఆయన అనుచరులు ఏ మాత్రం జీర్ణించుకోలేకున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చి, ఆదరించారనే కృతజ్ఞత బాలినేనిలో వుంది. వైఎస్ జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని, అలా కాదనుకున్నంత కాలం కూడా తనను మంత్రి పదవిలో కొనసాగించలేదనే అసంతృప్తి సీఎంపై ఉంది. ఈ నేపథ్యంలో బాలినేని సోమవారం సంచలన వ్యాఖ్యలు ప్రధానంగా వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి సొంత పార్టీకి చెందిన పెద్దనేత తనను టార్గెట్ చేశారని బాలినేని ఆరోపించడం సంచలనం రేకెత్తించింది.
ఇంతకూ ఎవరా వైసీపీ పెద్ద నాయకుడు? బాలినేనిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఎం జగన్‌కు సమీప బంధువైన బాలినేనిని ఇబ్బంది పెడితే పరిణామాలు ఎలా వుంటారో తెలిసి కూడా సొంత పార్టీ వాళ్లు సాహసం చేస్తారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బాలినేనికి మొదటి నుంచి తన జిల్లాలో, పార్టీలో సమీప బంధువుతోనే సఖ్యత లేదు. ఈ విషయం అందరికీ తెలుసు.
తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్‌కు మంత్రి పదవి కొనసాగించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తిగా వున్నారనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి సన్నిహితుల వద్ద బాలినేని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేది కూడా నిజమని పార్టీ పెద్దలే చెబుతున్నారు. ఇక వైసీపీలో పెద్ద నాయకుడు అంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల రాజకీయ వ్యవహారాలను సజ్జల పర్యవేక్షిస్తుంటారు. సజ్జలతో బాలినేనికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.
మంత్రి పదవి నుంచి పక్కన పెట్టిన సందర్భంలో అలకబూనిన బాలినేనిని సజ్జలే సముదాయించి సీఎం దగ్గరికి పంపిన సంగతి తెలిసిందే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డితో బాలినేనికి స్నేహసంబంధాలున్నాయి. కుట్ర రాజకీయాలు చేసే మనస్తత్వం మాగుంటది కాదు. మరి ఎవరిని దృష్టిలో పెట్టుకుని బాలినేని ఘాటు వ్యాఖ్యలు చేశారనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి పదవి పోయినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని, తనపై ఎవరో కుట్రలు చేస్తున్నారనే భ్రమలో ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో నిన్నటి మీడియా సమావేశంలో బాలినేని ప్రస్తావించిన వాటిలో చాలా వరకు పాత సంగతులే.
ప్రతిపక్ష పార్టీల నేతలు సహజంగానే వ్యతిరేక ప్రచారం చేస్తూ వుంటాయి. వాటిని దీటుగా తిప్పుకొట్టాలే తప్ప, కుట్రలంటూ గగ్గోలు పెడితే ప్రయోజనం ఏంటి? తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసరడం అంటే… ప్రతిపక్షాల ట్రాప్‌లో పడ్డట్టే అని పలువురి అభిప్రాయం. మొన్నటి వరకు తనను హవాలా మంత్రి అని ప్రచారం చేయించడంతోపాటు తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిపై దుష్పచారం ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని బాలినేని చెప్పడం గమనార్హం.
కుట్రదారుల గురించి తెలుసని అంటున్న బాలినేని, వారికి దిమ్మతిరిగే ఎత్తుగడలు వేయడం రాజకీయ చతురత అవుతుంది. అంతే తప్ప, నిరాశతో కూడిన ప్రకటనలు చేయడం వల్ల ప్రతిపక్షాలను మరింత బలోపేతం చేసినవారవుతారని గ్రహిస్తే మంచిది.