మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు పదవి విషయంలో ఆశలు సన్నగిల్లుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయిన ఠాక్రే కు తిరుగుబాటుదార్లు షాకులిస్తున్నారు. 55 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 40 మంది తిరుగుబాటు క్యాంపులు చేరారంటే మాటలేమీ కాదు!
తిరుగుబాటుదార్లను నయానో భయనో లొంగదీసుకోవాలని శివసేన ముఖ్యనేత రౌత్ భావిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే తిరుగుబాటు దార్లకు భారతీయ జనతా పార్టీ నుంచి వీలైనంత బ్యాకప్ ఉందనేది సహజంగా వినిపిస్తున్న విశ్లేషణ. ఈ నేపథ్యంలో ఇంకొన్నాళ్లు అయినా క్యాంపును కొనసాగించి మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితిని కొనసాగింపజేసే అవకాశాలు ఉండనే ఉంటాయి.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే శిబిరం సానుభూతిని పొందే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా ఉంది. తిరుగుబాటుదార్లకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేకు ఇది వరకే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారంటూ ఆదిత్య ఠాక్రే ప్రకటించారు.
ఇది వరకూ సమావేశం సందర్భంగా సీఎం పదవిని చేపట్టాలనే అభిలాష ఉందా? అంటూ తన తండ్రి తిరుగుబాటు నేతను అడిగారని ఆదిత్య చెప్పుకొచ్చాడు. అలాగే తిరుగుబాటు దార్లు తనను డైరెక్టుగా కలిసి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కోరితే దానికి తను సిద్ధమంటూ కూడా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారట.
తిరుగుబాటు తో కలత చెంది.. ఉద్ధవ్ ఠాక్రే ఇది వరకే రాజీనామాకు సిద్ధపడ్డారని, రెండు సార్లు రాజీనామా ఆలోచనను తన సాటి నేతలతో పంచుకుంటున్నట్టుగా శివసేనలోని ఠాక్రే వర్గం చెబుతోంది. అయితే ముఖ్యనేతల వారింపుతో ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా ఆలోచనను విరమించుకున్నట్టుగా కూడా ఆ వర్గం చెబుతూ ఉంది.
ఏతావాతా.. తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేకు ప్రభుత్వ మనుగడ మీదే ఆశలు సన్నగిల్లుతున్నట్టుగా ఉన్నట్టుంది!