మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు క్యాంపులో తలదాచుకున్నారు. వీరి సంఖ్య 40 వరకూ ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే తిరుగుబాటు దార్లు ఇప్పటి వరకూ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. వారికి కేంద్ర బలగాల రక్షణ ఇవ్వనుందట కేంద్రంలోని ప్రభుత్వం. ఆ బలాగాల సహకారంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అధికారికంగా అయితే కూటమి ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వారిలో శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు తో ప్రభుత్వం మైనారిటీలో పడినట్టే!
అయితే శాసనసభలో విశ్వాస లేదా అవిశ్వాస పరీక్ష జరిగితేనే ఈ నంబర్ గేమ్ క్లైమాక్స్ కు వస్తుంది. తిరుగుబాటు దార్లలో కొందరిపై వేటు వేయడం ద్వారా, వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా చేయడం ద్వారా మిగిలిన వారిని దారికి తెచ్చుకునే వ్యూహాన్ని అవలంభించాలని శివసేన నాయకత్వం భావిస్తున్నట్టుగా ఉంది. అయితే తిరుగుబాటు దార్లు సుప్రీం కోర్టుకు వెళ్లి తమపై చర్యలకు తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు!
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం తదుపరి ఘట్టం కాబోలు. బీజేపీకి సొంతంగా 106 మంది ఎమ్మెల్యేలున్నారు. తిరుగుబాటు దార్ల సహకారంతో బీజేపీ గనుక ప్రభుత్వాన్ని కూల్చేస్తే.. తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కోసం ప్రయత్నాలు సాగించవచ్చు. శివసేన తిరుగుబాటు దార్లంతా బీజేపీ వైపు నడిస్తే.. వీరికి ఏ స్వతంత్రులో, కూటమిలోని చోటా పార్టీలు సహకరిస్తే.. అప్పుడు బీజేపీ కనీస మెజారిటీకి చేరువ అవుతుంది.
అయితే… బీజేపీ అంత చేస్తుంటే ఠాక్రే, పవార్ లు చూస్తూ కూర్చోకపోవచ్చు. తమ వైరి పక్షానికి అవకాశం లభించకముందే.. ప్రభుత్వం రద్దుకు కూడా పూనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే గవర్నర్ చేతుల్లోకి గేమ్ వెళ్లిపోవచ్చు! బీజేపీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్టే అవుతుంది.
కానీ కలగాపులగం ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయగలదా? ఏర్పాటు చేసినా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పని జరుగుతుందా? కొన్నాళ్లకు అయినా.. వారిపై వేటు తప్పకపోవచ్చు. ఇది వరకూ కర్ణాటకలోనూ ఇలానే జరిగింది. అయితే కర్ణాటకలో తిరుగుబాటు దార్లు కొంతమంది నెగ్గారు.
అవసరానికి తగ్గట్టుగా కాంగ్రెస్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను చీల్చుకుంటూ వచ్చింది. దీంతో.. ప్రభుత్వం నడుస్తోంది. అయితే మహారాష్ట్రలో అదంత తేలిక కాకపోవచ్చు కమలం పార్టీకి!