మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో తనపై కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ నేతలు కలిసి కుట్రకు తెరలేపారన్నారు. వారిలో వైసీపీ పెద్దలు కూడా ఉన్నారని సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. ఒక అవకాశం ఇస్తున్నానని, పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ప్రతి సంఘటనలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వీటి వెనుక ఎవరున్నారో తనకు తెలుసన్నారు. వాళ్ల సంగతి చూస్తానని హెచ్చరించారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారితో టీడీపీ నేతలు టచ్‌లో వున్నారని ఆరోపించారు. తనపై జరుగుతున్న కుట్రలను త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి రుజువైనా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు.
టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ వ్యవహారాన్ని త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. పవన్ రిక్వెస్ట్ చేస్తేనే జనసేనవారిపై కేసులు ఉపసంహరించుకున్నట్టు వాసు తెలిపారు. ఇదిలా వుండగా బాలినేని సంచలన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. బాలినేనిపై కుట్రకు పాల్పడుతున్న వైసీపీ పెద్దలెవరనే విషయమై చర్చ జరుగుతోంది.