మహారాష్ట్రలో రాజకీయ నాటకం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉద్ధవ్ ఠాక్రే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నాల్లో మహారాష్ట్ర సీఎం ఉన్నారు. మరోవైపు అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఏక్‌నాథ్‌షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీం ధర్మాసనం షిండే తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ముంబయ్‌లో పరిస్థితులు సరిగా లేకపోవడం వల్లే సుప్రీంను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తరపు న్యాయవాది స్పందిస్తూ ఎమ్మెల్యేల అనర్హతపై డిప్యూటీ స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యేలకు భారీ ఊరటనిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏక్‌నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
శివసేన శాసనసభా పక్షనేత అజయ్ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది. దీంతో శివసేన రెబల్స్‌కు భారీ ఊరట లభించినట్టైంది.