వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆత్మకూరు నూతన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా విక్రమ్‌ను జగన్ అభినందించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి విక్రమ్ వెళ్లారు. 82 వేల పైచిలుకు భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై విక్రమ్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
సీఎంను కలిసిన అనంతరం విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి సీఎం జగన్ అండగా నిలిచారని ప్రశంసించారు. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు విస్తృతంగా వెళ్లాయనడానికి ఆత్మకూరు ఫలితమే నిదర్శనమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకూ వెళ్లినపుడు సంక్షేమ పథకాలు ఎంత బాగా అమలువుతున్నాయో తెలిసొచ్చిందన్నారు.
అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారని చెప్పుకొచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనుల గురించి సీఎం చర్చించారన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతి పై దృష్టి పెడుతున్నానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయ త్నాలు చేస్తున్నామన్నారు.
విక్రమ్ అన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పని చేసి అందరి ఆదరణ పొందారు. అన్న ఆశయాల్ని నెరవేర్చేందుకు తన పదవిని ఉపయోగించాలనే ఆలోచన అతనిలో కనిపిస్తోంది. రానున్న రోజుల్లో విక్రమ్ ప్రజాదరణ పొందడం అనేది అతని పనితీరుపైనే ఆధార పడి వుంటుంది.