Dead Men Tell No Tales (శవాలు కథలు చెప్పలేవు) పైరేట్స్ ఆఫ్ కరిబియన్ సినిమా సీక్వెల్ పేరు ఇది. అయితే Dead Men Tell Tales (శవాలు కథలు చెబుతాయి) ఒక పుస్తకం పేరు. కేరళకు చెందిన డాక్టర్ ఉమాదాతన్ ఫోరెన్సిక్ ఎక్స్‌ఫర్ట్, పోస్టుమార్టం స్పెషలిస్ట్. వృత్తి గురించి ఆయన మళయాళంలో “ఒరు పోలీస్ సర్జన్లు ఒర్మక్కురిప్పకల్ ” అని రాస్తే దాని ఇంగ్లీష్ అనువాదానికి ఈ పేరు పెట్టారు. ఒక రకంగా పోలీస్ సర్జన్ ఆత్మకథ.
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో తొలిసారి శవాన్ని కోస్తున్నపుడు ఉమాదాతన్ గురువు డాక్టర్ కాంతాస్వామి ఏం చెప్పాడంటే “శవాలు కథలు చెబుతాయి. చెవి ఒగ్గి జాగ్రత్తగా మనం వినాలి”
“పోస్టుమార్టం రిపోర్ట్‌లో పొరపాటు జరిగితే అమాయకులకి శిక్ష పడొచ్చు. నేరస్తులు తప్పించుకోవచ్చు. అందుకే సర్జరీ చేసినంత శ్రద్ధగానే పోస్టుమార్టం చేయాలి” అంటాడు రచయిత.
ఒక డిటెక్టివ్ నవల చదువుతున్నట్టుగా అనేక సంఘటనలు చెబుతాడు. ఒకసారి ఒక అమ్మాయి శవం చూసి డాక్టర్ షాక్ అయ్యాడు. ఎందుకంటే రెండు నెలల క్రితం ఆమె ఆస్పత్రికి వచ్చి అబార్షన్ చేయమని అడిగింది. 1973 నాటికి అబార్షన్ చట్ట విరుద్ధం. చేయలేనని చెప్పాడు. తర్వాత సూసైడ్ చేసుకుంది.
పోలీస్ స్టేషన్లో నిందితుడు ఏ కారణంతో చనిపోయినా లాకప్ డెత్ అని రాజకీయ పార్టీలు నిర్ణయానికి వచ్చేస్తాయి.
త్రివేండ్రం పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో విక్రమనచారి (45) అనే వ్యక్తి చనిపోయాడు. పోలీసులు ఆస్పత్రికి శవాన్ని తెచ్చారు. ఇది లాకప్‌డెత్ అని అతని బంధువులు రాజకీయ పార్టీల నాయకులు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌కి శరీరంపై దెబ్బలు కనబడలేదు. గుండెని పరిశీలిస్తే కరోనరి థ్రాంబోసిన్ అనే జబ్బు వుందని తేలింది. అయితే పత్రికలు, రాజకీయా పార్టీలు పోస్టుమార్టం నివేదిక తప్పుగా ఇచ్చారని గొడవ చేశాయి.
తన వృత్తి జీవితంలో పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిడికి గురి కాలేదని ఉమాదాతన్ అంటాడు. పోలీస్‌స్టేషన్‌లో ఎక్కువ ఆందోళనకి గురవుతారని ఆల్రెడీ గుండె జబ్బులుంటే స్టేషన్లో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ.
పోలీస్ సర్జన్ అంటే వైద్యుడే అని, వాళ్లని పోలీసులు ఆదేశించలేరని బయటి సొసైటీలో తాము పోలీసులు చెప్పినట్టు వింటామనే అపోహ వుందని రచయిత అంటాడు.
పోస్టుమార్టంలో శవాల మీద ఉండే ప్రతి గుర్తు మనకి ఏం జరిగిందో చెబుతాయి. చాలాసార్లు హత్య చేసి ప్రమాదంగా చిత్రిస్తుంటారు. అయితే గాయాలు మనకు నిజం చెబుతాయి అంటాడు ఈ సర్జన్. క్రైం ఇన్వెస్టిగేషన్‌పై ఆసక్తి వున్న వాళ్లు చదవాల్సిన పుస్తకం.
జీఆర్ మహర్షి