రాజకీయంగా తమను వ్యతిరేకించే ప్రత్యర్థులను విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ వేటాడుతోంది. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని విపక్షాలపై వేటకుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలను నిజం చేస్తూ శివసేన ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది.
కేంద్రప్రభుత్వ వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి మలుపు తిరుగుతున్నాయి. థాక్రే ప్రభుత్వం గాలిలో దీపంలా మినుకు మినుకుమంటోంది. శివసేన నేత, మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.
షిండే, ఆయన మద్దతుదారులకు వ్యతిరేకంగా మొదట గొంతెత్తిన నేత సంజయ్ రౌత్. షిండేతో పాటు ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు ప్రతి క్షణం హెచ్చరికలు, కౌంటర్లు ఇస్తున్న సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో.. సంజయ్ రౌత్‌ను ప్రశ్నించాల్సి ఉందని ముంబైలోని ఈడీ కార్యాలయం పేర్కొంది. మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ తానిచ్చిన సమన్లలో స్పష్టం చేసింది. పాత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి.. 1,034 కోట్ల గోల్‌మాల్ చేసినట్టు సంజయ్ రౌత్‌పై ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి గత ఏప్రిల్‌లో సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
తాజాగా తనకు ఈడీ నోటీసుల జారీపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. విచారణ కోసమే కాదు, అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. తానెవరికీ భయపడే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. ఇదిలా వుండగా సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులపై తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే తనయుడు వెటకరించారు. ‘ఈడీ సమన్ల నేపథ్యంలో సంజయ్ రౌత్‌కు నా శుభాకాంక్షలు’ అని ఆయన వ్యంగ్య ప్రకటన చేయడం గమనార్హం.