నరసాపురం ఎంపీ రఘురామరాజు దేశ రాజధాని ఢిల్లీకి మకాం మార్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ సైనికాస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం రఘురామకృష్ణంరాజును మార్చిన సంగతి తెలిసిందే. సైనికాస్పత్రి నివేదిక అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది.
అయితే తనకు ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మరో మూడునాలుగు రోజులు సైనికాస్పత్రిలోనే చికిత్స తీసుకుంటానని రఘురామకృష్ణంరాజు సంబంధిత అధికారులకు విన్నవించారు. రఘురామ వినతి మేరకు ఆయనకు ట్రీట్‌మెంట్ అందించారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆయన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారనే వార్తలొస్తున్నాయి. తన రెండు కాళ్లూ బాగా నొప్పి పెడుతున్నాయని, అలాగే మగతగా ఉందని, బీపీ పెరిగిందని , ఇలా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు చెబుతున్నట్టు పరిస్థితుల్లో… ఢిల్లీ ఎయిమ్స్‌లో మెరుగైన ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు వెళ్తున్నట్టు సమాచారం.
రఘురామకృష్ణంరాజు అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజద్రోహం కేసు నుంచి రఘురామకు ఎలాంటి ఊరట లభించలేదు.
ఏపీ సీఐడీ విచారణకు హాజరై సహకరించాలని రఘురామను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే విచారణకు 24 గంటల ముందు ఎంపీకి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. రఘురామ త్వరగా కోలుకుంటే, తిరిగి విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.