బెజవాడ రాజకీయం ఎప్పుడూ కులాల కుంపటే. అయితే అందులో కూడా రాజకీయ చలిమంటలు వేసుకునే రకం చంద్రబాబు. బెజవాడపై ఉన్న కాపు డామినేషన్ ని చెరిపేసేందుకు బాబు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. దాని కోసం పార్టీని బలిచేయడానికైనా వెనకాడరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు బొండ ఉమ, బుద్ధా వెంకన్న.
బెజవాడ రాజకీయంపై కేశినేని నానికి పెత్తనం అప్పగించడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుని సరిదిద్దుకోడానికి ఇప్పుడు బొండా, బుద్ధా లకు రాజకీయ సమాధి కడుతున్నారు. టీడీపీని అంటిపెట్టుకుని ఉంటూ, కష్టకాలంలో కూడా పార్టీ కోసం పనిచేసిన నాయకులు బుద్ధా వెంకన్న, బొండా ఉమ. విజయవాడ రాజకీయాల్లో బలంగా ఎదుగుతున్న 'నగరాలు' అనే సామాజిక వర్గానికి బుద్ధా ప్రతినిధి.
ఈ ఏడాదితో ఎమ్మెల్సీ కాలం పూర్తవుతుండే సరికి ఆయనలో రాజకీయ అభద్రతా భావం ఏర్పడింది. ఏ బీసీ మంత్రినైనా తిట్టించడానికి చంద్రబాబు బుద్ధాని ఎంపిక చేసుకుంటారు. పని అయిపోగానే పక్కనపెట్టేస్తుంటారు. గతంలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చారన్నమాటే కానీ, విజయవాడ రాజకీయాల్లో ఆయన మాటకు విలువ లేదు.
ఇక బొండా ఉమ. టీడీపీలోనే కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగారు. అయితే కాపు సామాజిక వర్గం కావడంతో సహజంగానే చంద్రబాబు పక్కనపెట్టారు. బెజవాడపై కాపు డామినేషన్ ఉన్నా కూడా.. టీడీపీలో బొండా ఉమకు అంత సీన్ లేకుండా చేశారు.
ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మేయర్ అభ్యర్థి విషయంలో బొండా ఉమ, బుద్ధా వెంకన్న మాటకు విలువే లేకుండా చేశారు చంద్రబాబు. కేశినేని నాని కుమార్తెను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఓడిపోయే కార్పొరేషన్ కి కూడా అంతలా చంద్రబాబు ఎందుకు పట్టుబట్టారో అర్థం కావడం లేదు. మేయర్ అభ్యర్థిగా బీసీని కానీ, కాపుని కానీ ప్రకటించాలని వెంకన్న, ఉమ కోరినా కూడా బాబు పెడచెవిన పెట్టారు, ఫలితం అనుభవించారు. వైసీపీ మాత్రం బెజవాడ మేయర్ పీఠంపై బీసీ మహిళను కూర్చోబెట్టి కులరాజకీయాలకు స్వస్తి పలికే ప్రయత్నం చేసింది.
వాస్తవానికి బుద్ధా వెంకన్న, బొండా ఉమ… పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేస్తారనే పేరుంది. కానీ చంద్రబాబు మాత్రం విజయవాడ అంటే కేశినేని నానినే పరిగణలోకి తీసుకుంటారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగు పులుముకున్న నాని, ఆ తర్వాత మూడునెలలకే రంగు మార్చారు, టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో కూడా పవన్ కల్యాణ్ ని బుజ్జగించి మరీ బెజవాడ సీటుని చంద్రబాబు, నానికి ఇప్పించుకున్నారు.
2019లో చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితుల్లో నాని ఒడ్డున పడ్డారు. కానీ ఆయన మాటకే బాబు విలువ ఇస్తారు. ఆయన పార్టీకి చేసిందేం లేకపోయినా.. చంద్రబాబును భయపెట్టో, బుజ్జగించో తన పనులు తాను చేసుకుంటున్నారు. పైగా బాబు-కేశినేనికి మధ్య తెరవెనక ఆర్థిక బంధం బలంగా ఉంది.
నానితో విభేదిస్తూన్నా.. టీడీపీని వీడి బయటకు వచ్చే సాహసం చేయట్లేదు బొండా ఉమ – బుద్ధా వెంకన్న. స్వపక్షంలో విపక్షంలా తమ వర్గాన్ని తాము కాపాడుకోడానికి తంటాలు పడుతున్నారు. వీరిద్దరూ వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడం.. బాబుకి మరింత అలుసుగా మారింది. అందుకే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు.
అటు నాని అరాచకాలు పెరిగిపోతున్నా, పార్టీని క్యాడర్ వీడిపోతున్నా.. చంద్రబాబు అండ ఆయనకే ఉండటం.. బొండా-బుద్ధాకు పెద్ద అడ్డంకిగా మారాయి. నిజంగా వీళ్లిద్దరి కష్టం పగవాడికి కూడా వద్దు.