ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని, కిషన్ రెడ్డిని కలిసి మంతనాలు సాగించారనే వార్తలు బలంగా వినిపించాయి. ఈటలకు రాజ్యసభ సీటు ఇచ్చి, కేంద్ర సహాయమంత్రి పదవి కూడా ఇస్తారనే పుకార్లు కూడా జోరుగా సాగాయి. టీఆర్ఎస్ బహిష్కృత నేతకు బీజేపీ అధిష్టానం అంత ప్రాధాన్యం ఇస్తుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. కిషన్ రెడ్డి మీటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. ఈటలను తానింకా కలవలేదని ఆయన చెప్పేశారు.
తనను కలవాలంటూ ఈటల రాజేందర్ వర్తమానం పంపిన విషయం నిజమేనని, ఆయన్ని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. పదిహేనేళ్ల పాటు తాము కలసి పనిచేసిన వ్యక్తులమేనని అన్నారు కిషన్ రెడ్డి. అదే సమయంలో కిషన్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
సహజంగా ఉప ఎన్నికలంటే ప్రతిపక్షాలు ముందుకు దూకుతుంటాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాయి. అధికార పార్టీ బలం తగ్గిందని నిరూపించడానికి నానా తంటాలు పడుతుంటాయి. అందులోనూ తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది.
సాగర్ తేడా కొట్టినా.. రేపు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటే ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోవడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నిక వస్తే.. తాము పోటీ చేయాలో లేదో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు కిషన్ రెడ్డి. పార్టీలో చర్చించి అభిప్రాయం చెబుతామన్నారు.
ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం తమదేనని చెప్పడం నేతలకు అలవాటు, పార్టీలకు ఆనవాయితీ. కానీ ఉప ఎన్నికల్లో పోటీ ఉంటుందో లేదో అని అనుమానం వ్యక్తం చేశారంటే.. పరోక్షంగా ఈటలకు సపోర్ట్ చేస్తారని అర్థమవుతోంది. అంటే ఇన్నాళ్లూ.. ఈటల జాతీయ పార్టీ నేతల చుట్టూ తిరిగింది వాటిలో చేరడానికి కాదు, ఉప ఎన్నికల్లో సపోర్ట్ చేయండని కోరడానికి అనే అనుమానం మొదలవుతోంది.
ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్. అందుకే నాయకులు, కార్యకర్తలెవరూ చేజారకుండా ప్రయత్నాలు మొదలు పెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయంలో దూకుడుమీదున్నారు.
రాజీనామా చేసి ఈటల ఇండిపెండెంట్ గా బరిలో దిగితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఓట్లు చీల్చేస్తే ఈటల పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ గెలిస్తే.. ఈటల తలఎత్తుకోగలరా, ఆయన రాజకీయ భవిష్యత్ ఏమవుతుంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన ముందు జాగ్రత్తగా జాతీయ పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
అసలుసిసలు తెలంగాణ పోరాట యోధులెవరో తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుతున్న ఈటల.. హుజూరాబాద్ కి ఉప ఎన్నికలొస్తే.. అవి టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అనేలా ఉండాలని కోరుకుంటున్నారు.
ఒంటరిగా ఈటల బలం ఇదీ అని నిరూపించి ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలో ఆలోచించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈటల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే బీజేపీ పోటీ అనుమానం అంటూ హింట్ ఇచ్చారు కిషన్ రెడ్డి. మరి కాంగ్రెస్ నేతలు ఈటలకు ఏమని మాటిచ్చారో తేలాల్సి ఉంది.